నగరంలో లాక్‌డౌన్ లేనట్టే!

by  |
నగరంలో లాక్‌డౌన్ లేనట్టే!
X

దిశ, న్యూస్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో మళ్ళీ సంపూర్ణ లాక్‌డౌన్ ఉంటుందా ఉండదా అనే గందరగోళానికి తెర పడింది. లాక్‌డౌన్ విధించే అవసరం లేదని ప్రభుత్వం ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. తాజాగా జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వులే అందుకు బలం చేకూరుస్తున్నాయి. లాక్‌డౌన్ విధించాలా వద్దా అనేదానిపై చర్చించేందుకు క్యాబినెట్ సమావేశం అవసరం సైతం లేదని తేలిపోయింది. కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 2.0 మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం సైతం బుధవారం ఉదయం జీవో విడుదల చేసింది. ఆ ప్రకారం రాత్రిపూట కర్ఫ్యూ 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5.00 గంటల వరకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నది. హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో నగరంలో సంపూర్ణ లాక్‌డౌన్ ఉండదని స్పష్టత ఏర్పడింది.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, పబ్‌లు, క్లబ్బులు, సినిమా థియేటర్లు, బార్లు… లాంటివన్నీ మూసివేసే ఉంచనున్నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా యధాతథంగా వాటిని అమలుచేస్తోంది. కంటైన్‌మెంట్ జోన్లలో కరోనా కట్టడి చర్యలు యధావిధిగా కొనసాగనున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హైదరాబాద్‌లో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో సంపూర్ణ లాక్‌డౌన్ విధించే ఆలోచనకు మంగళం పలికినట్లు ఆ జీవో ద్వారా స్పష్టత ఏర్పడింది.

కరోనా మృతుల సంఖ్య ఎక్కువ లేకపోవడమే కారణం?

నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ దానికి కారణం ఎక్కువ టెస్టులు చేయించుకోవడమేనని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అయితే ఎంతమందికి పాజిటివ్ వచ్చినా మృతుల సంఖ్య మాత్రం ఆందోళన కలిగించేంత స్థాయిలో లేదని, ఇతర నగరాలతో పోలిస్తే తెలంగాణలో పెద్దగా భయపడాల్సిందేమీ లేదన్న వైద్య నిపుణుల అభిప్రాయం కూడా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించకపోవడానికి ఒక కారణంగా తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న సమయంలో మళ్ళీ లాక్‌డౌన్ విధించడం ద్వారా ఇబ్బంది ఎదురుకావొచ్చని కూడా ప్రభుత్వం భావిస్తోంది. లక్షణాలు లేకపోయినా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోడానికి ప్రజలు సిద్ధపడుతున్నారని, పాజిటివ్ అని తెలిసిన తర్వాత జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ ఐసొలేషన్‌లోనే ఎక్కువగా ఉంటున్నారని, ఈ చైతన్యం వచ్చినందున ఇప్పుడు మళ్ళీ లాక్‌డౌన్ ఆలోచన అవసరం లేదని ప్రభుత్వానికి కొందరు సూచించినట్లు తెలిసింది.

కొనసాగుతున్న అప్రకటిత లాక్‌డౌన్

ప్రభుత్వం లాక్‌డౌన్ విధించకపోయినా వర్తక, వాణిజ్య సంఘాలు స్వచ్ఛంద లాక్‌డౌన్ విధించుకున్నాయి. వివిధ వృత్తి సంఘాలు కూడా దీన్నే పాటిస్తున్నాయి. నగర ప్రజలు సైతం లక్షల సంఖ్యలో సొంతూళ్ళకు వెళ్లిపోయారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు చాలా మంది వారి కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని సొంతూళ్లకు పంపించేశారు. విద్యార్థులు, కోచింగ్ తీసుకునేవారు సైతం నగరానికి ఇప్పట్లో రాకూడదనే అభిప్రాయంతో ఉన్నారు. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఉద్దేశంతో లాక్‌డౌన్ ఆలోచన నుంచి పక్కకు తప్పుకున్నా లేక కరోనా మృతులు పెద్దగా లేవనే నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుని విరమించుకున్నా ప్రజలు మాత్రం గతంలో సీఎం చెప్పిన బతికుంటే బలుసాకు పలుకులను గుర్తుకుతెచ్చుకుని స్వీయ రక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ వ్యాధి బారిన పడి శారీరకంగా, ఆర్థికంగా చితికిపోయి కుటుంబ సభ్యులను మానసిక ఆందోళనలోకి నెట్టడానికి బదులు దీపముండగానే తరహాలో పల్లెలే శ్రేయస్కరమనుకుని నగరాన్ని విడిచి వెళ్లిపోతున్నారు.


Next Story