వరంగల్‌ వరదలు.. సర్కారుకు లింక్ ?

by Anukaran |   ( Updated:2020-08-23 23:00:20.0  )
వరంగల్‌ వరదలు.. సర్కారుకు లింక్ ?
X

దిశ, వరంగల్ సిటీ: తెలంగాణలోనే రెండో పెద్ద నగరంగా పేరొందిన వరంగల్‌లో ఇటీవల వచ్చిన భారీ వరదలు ఓ గుణపాఠంగా మారాయి. నగరం అభివృద్ధిపై తీవ్ర ఎఫెక్ట్ పడిందని నిపుణులు చెప్తున్నారు. కేంద్రం ప్రభుత్వం నిధులు పూర్తిగా వాడకపోగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న నిధులు ఇవ్వలేదు. హామీలు నెరవేరితే ఓరుగల్లుకు ఈ పరిస్థితి వచ్చేది కాదని స్పష్టమవుతోంది.

2016లో కురిసిన భారీ వర్షాలకు ఓరుగల్లు సైతం నీట మునిగింది. దాదాపు 40కిపైగా కాలనీలు జలమయమయ్యాయి. నాడు వర్షపాతం 15 సెంటీమీటర్లు కాగా, ఇటీవల నగరంలో దాదాపు 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకావడంతో 100కు పైగా కాలనీలు నీటమునిగాయి. వేలాది ఇళ్లలోకి నీరు చేరింది. పదివేల మందికిపైగా సహాయ క్రేందాల్లో తలదాచుకున్నారు. నాలాలను ఆక్రమించుకుని నిర్మాణాలు, చెరువుల కబ్జా, అక్రమ లేఅవుట్లు, సక్రమైన డ్రైనేజీ వ్యవస్థలు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

మారని ప్రణాళికలు

వరంగల్ నగరం 1949లో మున్సిపాలిటీ ఉండగా.. 1961లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యింది. 1994లో నగర పాలక సంస్థగా, 2013లో వరంగల్ మహా నగర పాలక సంస్థగా ఆవిర్భవించింది. అయితే వరంగల్ నగరం తన పరిధిని పెంచుకున్న ప్రతీ సారి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సి ఉండగా, 2013 వరకు 1971 నాటి నగర అభివృద్ధి ప్రణాళికనే జీడబ్ల్యూఎంసీ కూడా అమలు చేస్తూ వస్తోంది. 2013లో ఒక ప్రణాళికను రూపొందించగా.. ది కార్యరూపం దాల్చలేదు. 2017 అక్టోబర్ నెలలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. అనంతరం ప్రజల నుంచి ఫిర్యాదులను, విజ్ఞప్తులను స్వీకరించినా.. నేటికీ ఆమోదం పొందలేదు.

నిధులు ఇవ్వలే..

తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి బడ్జెట్‌లో ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. స్మార్ట్ సిటీగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం, హృదయ్, అయృత్ వంటి పథకాలకు వరంగల్ మహా నగరం ఎంపికైంది. నిధుల వరద పారాల్సిన చోట నీళ్ల వరద పారింది. రాష్ర్ట ప్రభుత్వం ఇస్తామన్న బడ్జెట్ ఇంతవరకు రాలేదు. ఇక కేంద్రం స్మార్ట్ సిటీలో భాగంగా రూ.95 కోట్లు ఇచ్చింది. అయితే రాష్ర్ట ప్రభుత్వం ఆ నిధుల్లో కేవలం రూ.33 కోట్లు మాత్రమే వరంగల్ నగర అభివృద్ధికి కేటాయించింది. ఇక అమృత్ పథకంలో భాగంగా కేటాయించిన రూ.500 కోట్ల నిధులను రాష్ర్ట ప్రభుత్వం మిషన్ భగీరథలో వాడేసుకుంది. హృదయ్ పథకంలో రూ.45 కోట్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు వాటిలో కేవలం రూ.20 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మొత్తంగా రాష్ర్ట బడ్జెట్ రూ.400 కోట్లు, కేంద్ర నిధులు రూ.700 కోట్లు సరిగా సద్వినియోగం చేసుకుని ఉంటే నగర రూపం నేడు మరోలా ఉండేది.

మోరీలు, చెరువులు కబ్జా!

నగరంలోని చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాకు గురై కాలనీలుగా మారాయి. వరంగల్ నగరంలో ఒకప్పుడు 270కిపైగా చెరువులు, కుంటలు ఉండగా.. నేడు 100కి పరిమితమయ్యాయి. నగరంలో ప్రధానంగా 15 నాలాలు ఉండేవి. వాటిలో బొందివాగు నాలా, 12 మోరీల నాలా, భద్రకాళి నాలా, సమ్మయ్య నగర్ నాలా, అలంకార్ నాలా ప్రధానమైనవి. అయితే నేడు అవీ కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి.

పేదల ఇండ్లు కూల్చివేత

కాలువలు, నాలాలపై అక్రమంగా నిర్మించుకున్న పేదల ఇండ్లనే కూల్చివేస్తున్నారని, నాయకుల ఇండ్లను పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఇల్లు డ్రెయినేజీ కాల్వను ఆక్రమించుకుని నిర్మించినట్లు తెలుస్తోంది. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని మరో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు సైతం భద్రకాళి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారు. ఇక వివిధ వార్డుల్లో స్థానిక లీడర్ల అండతో పలువురు నాలాలను ఆక్రమించుకుని ఇళ్లను నిర్మించుకుంటున్నారు.

Advertisement

Next Story