వచ్చే నెలలో కరోనా ఫ్రీ !

by Anukaran |
వచ్చే నెలలో కరోనా ఫ్రీ !
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయని, తాము అంచనా వేసినట్లుగానే మరింతగా తగ్గిపోతాయని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబరు 2 నాటికి కనిష్ఠ స్థాయిలోనే కేసులు ఉంటాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబరు చివరి నాటికి కరోనా కేసులు దాదాపుగా కనుమరుగవుతాయన్నారు. డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడి విషయంలో తీసుకుంటున్న చర్యల వల్లనే ఈ ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయన్నారు. ఈ నెలలో టెస్టుల సంఖ్యను పెంచడం, తాము తీసుకుంటున్న కంటైన్‌మెంట్ విధానం వలన నగరంలో వైరస్ వ్యాప్తి బాగా అదుపులోకి వచ్చిందన్నారు. ప్రతిరోజూ సగటున యాభై వేలకు పైగానే కరోనా పరీక్షలు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో టెస్టుల సంఖ్య మరిన్ని పెంచుతామన్నారు. రోజూ వేలాది కేసులు నమోదవుతున్నా ఎక్కువ మందికి ఎలాంటి లక్షణాలు ఉండడం లేదని, హోమ్ ఐసొలేషన్‌లోనే ఉంటున్నారన్నారు. చాలా కొద్దిమందికి మాత్రమే ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఏర్పడుతోందన్నారు. చికిత్సపై మంచి నమ్మకం ఉన్నందునే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పాజిటివ్ పేషెంట్లు ఇక్కడ చికిత్స పొందుతున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ప్రైవేటు ఆసుపత్రులపై రెండు వేల ఫిర్యాదులు

కరోనా చికిత్స అందిస్తున్న రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులపై ఇప్పటివరకు రెండు వేలకంటే ఎక్కువే ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో పది శాతం మేర అధిక ఫీజులు వసూలు చేయడానికి సంబంధించినవేనని డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రెండు ఆసుపత్రులకు కరోనా చికిత్సకు ఇచ్చిన అనుమతులను రద్దు చేశామని, మిగిలిన ఆసుపత్రులపై దర్యాప్తు వివిధ దశల్లో ఉందని వివరించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో యాభై శాతం బెడ్‌లను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు చెప్పినా అవసరం ఏర్పడితే ఎన్ని బెడ్‌లనైనా తమ నియంత్రణలోకి తీసుకుంటామన్నారు.

రెండు వేల మంది వైద్య సిబ్బందికి కరోనా

రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న సుమారు రెండు వేల మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారని, తొమ్మిది మంది చనిపోయారని డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. కరోనా బారిన పడిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, వారి కుటుంబ సభ్యులకు కూడా అదే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. మరే విభాగం కంటే వైద్యారోగ్య శాఖలో సుమారు లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారని, ఇందులో ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు కూడా గణనీయ సంఖ్యలో ఉన్నారన్నారు. కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రభుత్వ డాక్టర్ నరేష్ కరోనా కారణంగా చనిపోయారని, ఆయన కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు కుటుంబంలో ఒకరికి గెజిటెడ్ ఉద్యోగం ఇవ్వడంపై ప్రభుత్వం ఇప్పటికే సానుకూల నిర్ణయం తీసుకుందని వివరించారు. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 2 శాతం మంది పేషెంట్లకు మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స అందాల్సిన పరిస్థితి ఉందన్నారు. మరణాలు దేశంలోని సగటుతో పోలిస్తే చాలా తక్కువ అని, ఒక శాతం కంటే తక్కువగానే ఉందని వివరించారు.

రెండోసారీ కరోనా వస్తోంది

ఒకసారి కరోనా బారిన పడి కోలుకున్నవారికి మళ్ళీ కరోనా సోకుతోందన్న అంశంపై డాక్టర్ శ్రీనివాసరావు వివరణ ఇస్తూ, హాంకాంగ్‌లో ఇలాంటిది రిపోర్టు అయిందని, దాన్ని కూడా అధ్యయనం చేస్తున్నామన్నారు. తొలిసారి స్థానికంగా వచ్చిన వైరస్‌లోని ఆర్ఎన్ఏ ఒక రకంగా ఉందని, అదే వ్యక్తికి రెండోసారి వచ్చిన వైరస్ యూరోపియన్ యూనియన్‌లో కనిపించే భిన్నమైన ఆర్ఎన్ కలిగిన వైరస్ అని వివరించారు. మన దేశంలో సైతం రెండోసారి వైరస్ వచ్చినట్లు కొన్ని రిపోర్టులు ఉన్నాయని, తెలంగాణలో ఇలాంటి వ్యక్తికి సంబందించిన నమూనాను మరింత లోతైన పరిశోధన కోసం రీసెర్చి సెంటర్‌కు పంపుతున్నట్లు తెలిపారు. శరీరంలో యాంటీ బాడీస్ తగ్గిపోయినప్పుడు రెండోసారి కూడా వైరస్ బారిన పడే అవకాశం ఉందన్నారు. ఒకవేళ అలా రెండోసారి వైరస్ సోకినా దాని తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని, ప్రాణానికి ప్రమాదం ఉండదన్నారు.

ఐదేళ్లలోపు పిల్లలకు మాస్కులు వద్దు

ఐదేండ్ల వయసులోపు పిల్లలకు మాస్కులు వేయవద్దని డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి సూచించారు. పన్నెండేళ్ళలోపు పిల్లలకు కూడా బయటకు వెళ్లినప్పుడు మాత్రమే మాస్కులు వేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కొవిడ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందించే భోజనం నాసిరకంగా ఉంటే డైటీషియన్‌పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రులలో ఒక్కో భోజనానికి రూ.275, జిల్లాలలో రూ.200 చొప్పున కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాసిరకం భోజనం పెడుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.

ప్లాస్మా చికిత్స ఫలితాలపై చెప్పలేం

కరోనా బారిన పడి తగ్గిన రోగుల నుంచి సేకరించిన ప్లాస్మా పాజిటివ్ రోగులకు ఇస్తే తగ్గుతుందనే వార్తలు వస్తున్నాయని, కానీ వాటిలోని శాస్త్రీయత, వైద్యపరమైన ఫలితాలపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదని డాక్టర్ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. ప్లాస్మాతో ప్రమాదం లేకపోవచ్చుగానీ దాని ఫలితాలపై విశ్లేషణ జరగాల్సి ఉందన్నారు. ఐసీఎంఆర్ సూచన మేరకు నగరంలో గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా బ్యాంకుతో పాటు చికిత్స కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక దశలో లేదా మధ్య దశలో ఉన్న పేషెంట్లకు ప్లాస్మా చికిత్సతో ఒక మేరకు ప్రయోజనం ఉండొచ్చుగానీ సీరియస్‌గా ఉన్న రోగుల విషయంలో ఫలితం ఉండకపోవచ్చన్నారు.

Advertisement

Next Story

Most Viewed