కంటైన్‌మెంట్‌ జోన్లలో 100 శాతం నో మూవ్‌మెంట్ అమలు

by Shyam |
కంటైన్‌మెంట్‌ జోన్లలో 100 శాతం నో మూవ్‌మెంట్ అమలు
X

దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ కేసులు తగ్గకుంటే అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంటామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. కంటైన్మెంట్ జోన్‌లో 100 శాతం నో మూవ్‌మెంట్ అమలు కావాలని ఆదేశించారు. శనివారం నగరంలోని ప్రగతి భవన్‌లో మైనార్టీ ప్రజా ప్రతినిధులతో కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ కరోనా మరణాలు ఎక్కువగా లేవని కానీ, పరిస్థితి విషమించితే అందుకు అనుగుణంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాలని మైనార్టీ ప్రజాప్రతినిధులను కోరారు. నెగెటివ్ వచ్చిన వారిని ప్రోత్సహించాలని, అలాంటి వారిని సొసైటీలో తలెత్తుకొనేలా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదలకు అందిస్తున్న రూ. 1500 వారి ఖాతాలోనే ఉంటాయని, వెనక్కి పోతాయనే అపోహ పెట్టుకోవద్దని చెప్పారు. సోమవారం నుంచి కంటైన్మెంట్ క్లస్టర్‌ లబ్ధిదారులకు మొబైల్ ఏటీఎం/ సీఎస్సీ ద్వారా ఇంటి వద్దకే నగదు పంపిణీ చేస్తామని తెలిపారు. మూడు రోజులుగా పంపించిన శాంపిల్స్‌లో పాజిటివ్ కేసులు నమోదు కాలేదన్నారు. ఇలాగే శాంపిల్స్ మరికొన్ని రోజులు నెగెటివ్ వస్తే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ప్రజలంతా కరోనా నివారణకు ప్రభుత్వం సూచనలు పాటించాలని కోరారు.

Tags: Nizamabad collector,Narayanareddy,meeting

Advertisement

Next Story

Most Viewed