పాఠశాలలు తెరవటంపై నీతి ఆయోగ్​ ఆందోళన

by Shyam |
schools opening
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాలలను ప్రారంభించడం వైరస్ వ్యాప్తికి కారణమవుతాయని నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ హెచ్చరించారు. కరోనా పరిస్థితులను సరిగా అంచనా వేయకుండా పాఠశాలలను తెరవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. స్కూళ్లలో కేవలం విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది​ కూడా ఉంటారు కాబట్టి వైరస్​వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని తెలిపారు. పాఠశాలలు తెరిచే విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని, ప్రాణాలను పణంగా పెట్టి దీనిపై నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఉత్తమమైన రక్షణ ఉన్నప్పుడు మాత్రమే స్కూల్స్ తెరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందించి రక్షణ కల్పించినప్పుడో.. వైరస్‌ చాలావరకు తగ్గిపోయినప్పుడు మాత్రమే స్కూల్స్ తెరవడం మంచిదిని తెలిపారు. ఇదివరకు స్కూళ్లు తెరిచినప్పుడు వైరస్‌ విజృంభించిన సందర్భాలు చాలా ఉన్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం వైరస్‌ తగ్గినట్టు కనిపించడానికి కారణం.. చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు విధించడంతో పాటు, ప్రజలు క్రమశిక్షణతో ఉండటమేని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆంక్షలు ఎత్తేయడంతో పాటు, పాఠశాలలు కూడా మొదలుపెడితే వైరస్‌ను ఆహ్వానించినట్టవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎప్పుడు స్కూళ్లు తెరవాలన్న నిర్ణయం పరిశీలనలో ఉందని రెండు, మూడు మంత్రిత్వశాఖలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. ఇప్పటివరకు ఎదురైన అనుభవాలను అనుసరించి చాలా అప్రమత్తతతో ఈ నిర్ణయం తీసుకోవాలి సూచించారు. ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తే కరోనా మూడో వేవ్‌ రావడానికి అవకాశం ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్‌ పెరుగుతున్నకొద్దీ అత్యధిక మందికి రక్షణ లభిస్తుందని, అంతవరకూ అందరూ కట్టుదిట్టమైన నిబంధనలను పాటించాల్సిన అవసరముందన్నారు. మరో 5-6 నెలలు ప్రజలు, ప్రభుత్వం కఠినంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

Advertisement

Next Story