- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంజాన్ మాసంలో కర్ఫ్యూ.. పోలీసులకు సవాళ్ళు
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నైట్ కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి అమలు విషయంలో అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి. నగరంలో నైట్ లైఫ్, కల్చర్‌లో వచ్చిన మార్పు నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను పటిష్టంగా అమలుచేయడం పోలీసులకు సవాలుగా మారింది. అసలే రంజాన్ మాసం కావడంతో పాత బస్తీలో ముస్లిం సోదరులను రోడ్లమీదకు రాకుండా కట్టడి చేయడం స్థానిక పోలీసులకు కత్తిమీద సాములా తయారైంది.
రాత్రి తొమ్మిది గంటల నుంచే నైట్ కర్ఫ్యూ అమలుచేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ దీన్ని రాత్రి పది గంటల నుంచి అమలు చేయాలని మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. జనం గుమికూడవద్దన్నదే ప్రభుత్వం ఉద్దేశం కావడంతో రంజాన్ పేరుతో రోడ్లమీదకు గుంపులుగా వచ్చే ప్రజలను నియంత్రించడంలో అక్కడక్కడా సమస్యలు ఎదురయ్యాయి.
పబ్‌లు, క్లబ్‌లు, బార్‌ల విషయంలో హైకోర్టు సీరియస్‌గా ఉండడం, నైట్ కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్ విషయంలో ప్రభుత్వానికి 48 గంటల డెడ్‌లైన్ విధించడంతో ఉత్తర్వులు వెలువడక తప్పలేదు. అయితే మద్యం ద్వారా ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం సమకూరుతున్నందున నైట్ కర్ఫ్యూతో ఒక మేరకు ఆదాయం పోయే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ నిర్ణయం తీసుకోవడంతో పటిష్టంగా అమలుచేయడానికి వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో కార్యాచరణను రూపొందించుకున్నాయి. అవసరం లేనివారు రోడ్ల మీదకు రావద్దని స్పష్టమైన ఆంక్షలు అమలులోకి వచ్చినందున పోలీసులు గతేడాదికంటే ఈసారి మరింతగా అప్రమత్తమయ్యారు.
ఆ సమన్వయంలో భాగమే ఆర్టీసీ బస్సు సర్వీసులు, ప్రైవేటు ట్రావెల్స్ రాకపోకలు, సిటీ బస్సుల టైమింగ్ మార్చడం, మెట్రో రైళ్ళను కుదించడం, దుకాణాలను తొందరగా మూసేయడం లాంటి చర్యలన్నీ.. సరైన కారణం లేకుండా రోడ్లమీదకు రావద్దని, అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉందని ప్రభుత్వం జీవోనే స్పష్టంగా పేర్కొనడంతో పోలీసులు చెక్‌పోస్టులు, పికెట్‌లు ఏర్పాటుచేశారు. కొన్ని సంస్థల యాజమాన్యాలు ప్రత్యేకంగా పాస్‌లను, గుర్తింపు కార్డులను జారీ చేశాయి. రాత్రి షిప్టుల్లో పనిచేసే పరిశ్రమలు, సేవా సంస్థల విషయంలో ప్రభుత్వ సడలింపులకు అనుగుణంగా పోలీసుల నుంచి ముందుగానే పర్మిషన్ తీసుకున్నాయి.
అప్రమత్తమైన ప్రజలు..
సెకండ్ వేవ్ పరిస్థితి సీరియస్‌గా ఉండడం, కరోనా పాజిటివ్ కేసులు వేల సంఖ్యల నమోదవుతూ ఉండడం, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్‌ల కొరత, ఆక్సిజన్ డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడం, సీరియస్ పేషెంట్లకు రెమిడెసివిర్ మందుల షార్టేజీ.. ఇవన్నీ ప్రజల కళ్ళముందు కనిపిస్తుండడంతో పాటు మాస్కును ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా లాంటి ఆంక్షలు కూడా ప్రజల్లో అప్రమత్తతను పెంచాయి. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరోనా బారిన పడక తప్పలేదన్న వార్త కూడా ప్రజల్లో కొంత మార్పును తీసుకొచ్చింది. పోలీసులు పెద్దగా ఇబ్బంది లేకుండానే నైట్ కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయడానికి ప్రజల నుంచి వచ్చిన స్వచ్చంద అమలు దోహదపడింది. ఇక నైట్ కర్ఫ్యూ నిర్ణయానికి అనుగుణంగా సినిమా థియేటర్లు, వాణిజ్య సంస్థలు, బార్లు, పబ్‌లు మూతపడడం పోలీసులకు ఒకింత ఊరటనిచ్చినట్లయింది.
పోలీసులకు సవాళ్ళు..
నైట్ కర్ఫ్యూ నిర్ణయంతో పగటి పూట రద్దీని నివారించడం పోలీసులకు సవాలుగా మారింది. నిత్యావసర వస్తువులు, వైద్య అవసరాలు తదితరాలన్నింటినీ రాత్రి ఎనిమిది గంటల లోపే సమకూర్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రజలు మార్కెట్లకు పోటెత్తుతున్నారు. సోషల్ డిస్టెన్స్ లాంటి నిబంధనలేవీ పాటించకపోవడంతో అక్కడ నియంత్రణా చర్యలను చేపట్టడం పోలీసులకు ఛాలెంజ్‌గా మారింది. కేవలం నైట్ కర్ఫ్యూ మీదనే దృష్టిలో పెట్టిన పోలీసులు పగటిపూట రద్దీ నివారణ విషయంలో మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక రంజాన్ మాసం కావడంతో పాత బస్తీలో పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులను రాత్రిపూట రోడ్లమీదకు రాకుండా నియంత్రించడం కూడా వారికి ఇబ్బందికరంగానే మారింది. ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాల్సి రావడం, మరోవైపు మతపరమైన సెంటిమెంట్లను గౌరవించాల్సి ఉండడం వారికి సంకట పరిస్థితుల్ని తీసుకొచ్చాయి.
ప్రయాణాలతో చిక్కులు
అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వడంతో కూకట్‌పల్లి, అమీర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, అఫ్జల్‌గంజ్ తదితర ప్రాంతాల్లోని బస్సు స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. మాస్కు నిబంధన అమలవుతున్నప్పటికీ సోషల్ డిస్టెన్స్ మాత్రం గాలికెగిరిపోయింది. కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సర్వీసులు రీషెడ్యూలు అయినప్పటికీ తొలి రోజు కావడంతో రాత్రి పదకొండు గంటల సమయానికి కూడా బస్సులు గమ్యస్థానాలకు బయలుదేరాయి. అయితే రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చిన ప్రయాణికుల విషయంలో మాత్రం క్యాబ్ సర్వీసులు ఎక్కువ ఛార్జీలను డిమాండ్ చేయడం, మార్గమధ్యంలో పోలీసులు తనిఖీలు చేయడం పెరిగింది.
చిరుద్యోగులకు చింత..
నైట్ కర్ఫ్యూ కారణంగా బార్లు, పబ్‌లు, క్లబ్బుల యాక్టివిటీ నిలిచిపోవడంతో అందులో పనిచేసే సిబ్బందిలో కొత్త ఆందోళన మొదలైంది. ప్రస్తుతం విధించిన నైట్ కర్ఫ్యూ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అని ప్రభుత్వం చెప్పినా ఆ తర్వాత కూడా ఇది కొంతకాలం కొనసాగితే ఉద్యోగం ఉంటుందో పోతుందోననే భయం మొదలైంది. ఇప్పటికీ వ్యాపారం పూర్తిగా పుంజుకోలేదని యాజమాన్యం అసంతృప్తితో ఉన్న సమయంలో నైట్ కర్ఫ్యూతో జీతంలో కోత పడుతుందేమోననే ఆవేదనను కొద్దిమంది వ్యక్తం చేశారు. మరోవైపు సిటీలో నైట్ లైఫ్ ఎక్కువగా ఉంటున్నందున దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, సుల్తాన్ బజార్, కోఠి లాంటి ప్రాంతాల్లో సాయంత్రం ఎనిమిది గంటలతో దుకాణాలను మూసేయాల్సి రావడంతో వ్యాపారం తగ్గిపోతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం సమయంలోనే ఎక్కువ వ్యాపారం జరుగుతుందని, ఇప్పుడు నైట్ కర్ఫ్యూతో ఒక మేరకు మళ్ళీ నష్టాల్లోకి కూరుకుపోవడమేనని వ్యాఖ్యానించారు.
దీనికితోడు ఫుట్‌పాత్‌ల మీద టిఫిన్, ఫాస్ట్ ఫుడ్, పానీపూరి లాంటి చిరు వ్యాపారాలు చేసేవారిపై నైట్ కర్ఫ్యూ ఎఫెక్ట్ పడింది. గతేడాది మొత్తం లాక్‌డౌన్‌తో చితికిపోవడంతో జనవరి నుంచి పుంజుకుంటుందన్న ఆశతో ఉన్న సమయంలో ఇప్పుడు నైట్ కర్ఫ్యూ రావడం వారికి నిరాశ కలిగించింది. స్వయం ఉపాధితో చిరు వ్యాపారాలు చేస్తూ పొట్ట నింపుకుంటున్న వేలాది మందికి నైట్ కర్ఫ్యూ ఇబ్బందిని కలిగించింది.