లాభాలను సాధించిన స్టాక్ మార్కెట్లు..

by Harish |
sensex 1
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గడిచిన రెండు మూడు సెషన్లలో ఆటుపోట్లకు గురవడం, లాభాల స్వీకరణ కారణంగా నష్టాలను ఎదుర్కొన్నాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు లాభాల బాట పట్టాయి. ఉదయం ప్రారంభం నుంచే లాభాలను దక్కించుకున్న స్టాక్ మార్కెట్లు చివరి వరకు అదే ధోరణిలో కొనసాగాయి. ముఖ్యంగా కీలక రంగాల షేర్లు కొనుగోళ్ల జోరును చూడటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో మార్కెట్లు మెరుగ్గా ర్యాలీ చేశాయి. అంతేకాకుండా సోమవారం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు మదుపర్ల సెంటిమెంట్‌ను బలపరిచిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 69.33 పాయింట్లు లాభపడి 58,47 వద్ద క్లోజయింది. నిఫ్టీ 24.70 పాయింట్లను సాధించి 17,380 వద్ద ముగిసింది. నిఫ్టీలో మీడియా ఇండెక్స్ ఏకంగా 14 శాతం పుంజుకుంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ 40 శాతం ర్యాలీ చేసిన తర్వాత మీడియా ఇండెక్స్ భారీగా లాభాలను సాధించింది. అలాగే, ఆటో, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు బలపడ్డాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫైనాన్స్ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ఎల్అండ్‌టీ, టైటాన్, టీసీఎస్ షేర్లు లాభాలను సాధించగా, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లె ఇండియా, ఆల్ట్రా సిమెంట్, హిందూస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.70 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed