Stock market : స్థిరమైన లాభాల్లో స్టాక్ మార్కెట్లు!

by Harish |   ( Updated:2021-05-27 07:06:15.0  )
Stock market : స్థిరమైన లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం ప్రారంభం నుంచి ఊగిసలాటకు గురైన సూచీలు చివరికి లాభాలను సాధించాయి. కరోనా కేసులు తగ్గిపోతూండటంతో స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలకు చేరుకుంటున్నాయి. నిఫ్టీ సైటం ఆల్‌టైమ్ రికార్డుకు చేరువలో ఉంది. మే నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్‌ల గడువు గురువారంతో ముగియడంతో స్టాక్ మార్కెట్లు రోజంతా ఆటుపోట్ల మధ్య కదలాడాయి. అలాగే, అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికాకు సంబంధించి కీలక గణాంకాలు విడుదల నేపథ్యంలో జాగ్రత్తగా ట్రేడయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 97.70 పాయింట్లు లాభపడి 51,115 వద్ద ముగియగా, నిఫ్టీ 36.40 పాయింట్ల లాభంతో 15,337 వద్ద ముగిసింది.

నిఫ్టీలో రియల్టీ షేర్లు మినహాయించి మిగిలిన రంగాల్లో కొనుగోళ్లు కనిపించాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్ ఇండెక్స్ అధికంగా 3 శాతం పుంజుకోగా, ఐటీ, మీడియా, మెటల్, ప్రైవేట్ బ్యాంక్ బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఆల్ట్రా సిమెంట్, నెస్లె ఇండియా, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా షేర్లు లాభాలను సాధించగా, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు నష్టాలను నమోదు చేసింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.57 వద్ద ఉంది.

Advertisement

Next Story