మూడో టీఎంసీ పనులపై సుప్రీంను ఆశ్రయించండి: ఎన్జీటీ

by Shyam |
మూడో టీఎంసీ పనులపై సుప్రీంను ఆశ్రయించండి: ఎన్జీటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, అయినా ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని లేదా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖను సంప్రదించాలని పిటిషనర్‌కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆదేశాలు జారీచేసినందున అదనంగా మరోసారి అదే అంశంపై జారీ చేయలేమని ఎన్జీటీ తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. గత ఆదేశాలను ధిక్కరించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మళ్ళీ ఆదేశాలు జారీ చేస్తే ఇంకోసారి కూడా ధిక్కరించే అవకాశం ఉంది గదా అని జస్టిస్ ఆదర్శకుమార్ గోయల్ నేతృత్వంలోని గ్రీన్ ట్రిబ్యునల్ ప్రధాన బెంచ్ వ్యాఖ్యానించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనుల విషయంలో ఎన్జీటీ జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నదంటూ తుమ్మల శ్రీనివాసరావు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే మూడో టీఎంసీ పనులను మొదలుపెట్టిందని, పర్యావరణానికి హాని జరుగుతోందని, పనులను నిలిపివేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఏ ప్రాంతంలో ఏ తరహా పనులు జరుగుతున్నాయో ఫోటోలతో సహా కోర్టుకు తన పిటిషన్‌లో వివరించారు. సోమవారం ఈ పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ పై విధంగా వ్యాఖ్యానించింది.

కాళేశ్వరం విస్తరణ పనుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడితే కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేయాలని, అక్కడ కూడా ఎలాంటి చర్యలు లేనట్లయితే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed