అవినీతి అంతానికే రెవె ‘న్యూ’ చట్టం : కేసీఆర్

by  |
అవినీతి అంతానికే రెవె ‘న్యూ’ చట్టం : కేసీఆర్
X

దిశ, న్యూస్‌‌బ్యూరో: రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన అవినీతిని అంతం చేసేందుకే కొత్త చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దీంతో ప్ర‌జ‌లు పడుతున్న బాధ‌ల‌న్నీ పోతాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతటి సంతోషం పొందుతున్నానని అన్నారు. కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ఆయన బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దాని ఆవశ్యకతను, ఫలితాలను సభకు వివరించారు. కాలక్రమంలో భూమి విలువ పెరగడంతో అనేక సమస్యలు, వివాదాలు వస్తున్నా యని అన్నారు. వాటిని సంస్కరించి, శాశ్వత పరిష్కారం కనుగొనాలన్న ఉద్దేశంతోనే మూడేళ్లుగా చేసిన కసరత్తు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చిందన్నారు. నిజాం సర్కారు తర్వాత ఏ ప్రభుత్వ మూ ఇంతటి సాహసం చేయలేదన్నారు. భూ వివాదాల పీడ విరగడ కావాలనే ఉద్దేశంతో ఇపుడు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

తెలంగాణ డిజిటల్ మ్యాప్..

ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నర్సింహారావు మొదలు వైఎస్సార్ హయాం వరకు రెవెన్యూ చట్టంలో ఎన్ని మార్పులు జరిగినా, ఎన్ని సంస్కరణలు వచ్చినా శాశ్వత పరిష్కారం మాత్రం లభించలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ కొత్త చట్టంతో ప్రజలకు సరళీకరణతోపాటు వివాదాలకు తావులేని వన్ టైమ్ సొల్యూషన్ దొరుకుతుందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనతో ప్రభుత్వం ఆశించిన మేర ఫలితాలు రాలేదని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పకడ్బందీ చట్టాన్ని రూపొందించామన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతీ అంగుళం భూమిని సర్వే చేయిస్తామని, డిజిటల్ తెలంగాణ మ్యాప్‌ను తయారు చేస్తామనీ అన్నారు. ప్రతీ సర్వే నెంబర్‌కు అక్షాంశాలు, రేఖాంశాల వివరాలను జోడిస్తామని, ఎవరి భూమినీ మరొకరు కబ్జా చేయడానికి ఆస్కారమే ఉండదన్నారు. గెట్టు, పుట్ట పంచాయితీలు ఇకపైన ఉండవన్నారు.

జాయింట్ రిజిస్ట్రార్‌లుగా తహసీల్దార్లు..

ఇకపైన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అంతా తహసీల్దార్ల చేతుల మీదుగా జరుగుతుందని సీఎం చెప్పారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ను సబ్ రిజిస్ట్రార్‌లు చూసుకుంటారని అన్నారు. తహసీల్దార్లంతా జాయింట్ రిజిస్ట్రార్‌లు అవుతారని తెలిపారు. వీఆర్వోల ఉద్యోగాలు ఎక్కడికీ పోవని, వారికి సంపూర్ణ ఉద్యోగ భద్రత ఉంటుందని వివరించారు. 20,292 మంది వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని ప్రకటించారు. వేతనాలతో ప్రభుత్వానికి ఏటా రూ.260 కోట్ల భారం పడుతున్నా వారి జీవితాలకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించిందన్నారు. వీఆర్ఏలలో ఎక్కువగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలే ఉన్నారని, వారి పొట్టకొట్టే ప్రసక్తే లేదన్నారు. వీఆర్వోలు సైతం సుమారు ఐదున్నర వేల మంది కంటే ఎక్కువగానే ఉన్నారని, వారి ఉద్యోగాలకు ఢోకా లేదని అన్నారు.

రెవెన్యూ అధికారుల సమ్మతితోనే..

రెవెన్యూ చట్టాన్ని రూపొందించే క్రమంలో ప్రభుత్వం ఆ శాఖ ఉద్యోగులతో కూడా మాట్లాడిందని సీఎం చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి చట్టాన్ని తెచ్చినా గౌరవిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ చట్టం వలన ప్రజలకు మేలు జరుగుతుందని, ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. రెవెన్యూ శాఖకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించే ఆ శాఖను ఎవ్వరికీ ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకున్నానని, కార్యదర్శిగా కూడా ఎవ్వరినీ నియమించకుండా బాధ్యతలను నేరుగా ప్రధాన కార్యదర్శికే అప్పగించానని పేర్కొన్నారు. శాశ్వత పరిష్కారం కోసం పకడ్బందీ చట్టాన్ని రూపొందించడానికి కొన్ని వేల గంటలు కష్టపడ్డామన్నారు. అన్ని పక్షాల అభిప్రాయాలను తెలుసుకోడానికి, సభ్యులంతా చదువుకోడానికి రెండు రోజుల సమయం కూడా ఇస్తున్నామని అన్నారు. శుక్రవారం చర్చ జరిగేలా స్పీకర్ అనుమతి ఇచ్చారన్నారు. ‘ధరణి’ పోర్టల్ ద్వారానే అన్ని రకాల పనులు జరిగేలా ఈ చట్టం చొరవ తీసుకుంటుందన్నారు. ప్రపంచంలో ఏ మూల నుంచైనా వారివారి భూములకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, డాక్యుమెంట్లను చూసుకోవచ్చని అన్నారు.

చార్మినార్‌నూ రిజిస్ట్రేషన్ చేసేశారు..

రెవెన్యూ శాఖ లీలల గురించి చెప్పాల్సి వస్తే చాలానే ఉన్నాయని పేర్కొన్న కేసీఆర్ మన చార్మినార్‌ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయిందన్నారు. సికింద్రాబాద్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లు కూడా వ్యక్తుల పేర్ల మీద రిజిస్టర్ అయిపోయాయని, దేశవ్యాప్తంగా ఈ దరిద్రం ఉందన్నారు. ఇకపైన కొత్త చట్టంతో ఇవేవీ సాధ్యంకావని, సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానమవుతున్నందున రిజిస్ట్రేషన్ చేయకూడని భూములన్నీ లాక్ అయిపోతాయని, ఏ ప్రయత్నం చేసినా కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ల బాధలు తప్పుతాయన్నారు. భూములకు సంబంధించిన ఈసీ (ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్) వివరాలు కూడా పోర్టల్‌లోనే ఉంటాయి కాబట్టి ఫిజికల్ కాపీల కోసం తిరగాల్సిన పని లేదన్నారు.

బ్యాంకుల చుట్టూ తిరిగే బాధ ఉండదు..

రాష్ట్రంలో ఇకపై వ్యవసాయ, వ్యవసాయేతర, అటవీ భూములు మాత్రమే ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. ఏ అధికారికీ విచక్షణాదికారాలు ఉండవన్నారు. ప్రజలు కూడా ఆఫీసుల చుట్టూ తిరిగే పని తప్పుతుందన్నారు. చెప్పినా వినకుండా కొందరు బ్యాంకర్లు రైతుల పాస్ బుక్కులను తనఖా పెట్టుకుంటున్నారని, కొత్త చట్టంతో ఇలాంటి జాడ్యాలు ఉండవన్నారు. ఇక నుంచి జీవి త కాలం వర్తించేలా లైఫ్‌ టైమ్‌ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరవుతాయని, తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాబేస్‌ ఆధారంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతాయని అన్నారు.



Next Story

Most Viewed