పీఎఫ్ఆర్‌డీఏ నుంచి కనీస హామీ పెన్షన్ పథకం!

by Anukaran |
పీఎఫ్ఆర్‌డీఏ నుంచి కనీస హామీ పెన్షన్ పథకం!
X

దిశ, వెబ్‌డెస్క్: పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్‌డీఏ) కనీస హామీతో కూడిన రిటర్న్ ఆధారిత పెన్షన్ పథకంపై పనిచేస్తోందని ఛైర్మన్ సుప్రతీం బంధోపాధ్యాయ్ వెల్లడించారు. ప్రతిపాదిత పథకానికి సంబంధించి పద్దతులను రూపొందించేందుకు ఫండ్స్, గణాంక సంస్థలతో పెన్షన్ అథారిటీ చర్చలు జరుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. అన్ని సరైన సమయంలో పూర్తయితే త్వరలో కనీస హామీ పెన్షన్ పథకం వచ్చే అవకాశాలున్నాయి. పీఎఫ్ఆర్‌డీఏ చట్టం ప్రకారం..కనీస హామీ రిటర్న్ పథకాన్ని ప్రారంభించాలనే ఆదేశాలున్నాయి. పెన్షన్ ఫండ్ పథకాల కింద నిర్వహించే నిధులు మార్కెట్ నుంచి మార్కెట్‌కు ఉంటాయి. దీనివల్ల మార్కెట్ కదలికలను బట్టి వాటి విలువలో అస్థిరత ఉంటుంది.

ఈ క్రమంలోనే ఫించన్ ఫండ్ మేనేజర్లు, గణాంక సంస్థలతో కలిసి పెన్షన్ పథకాన్ని చర్చిస్తున్నామని బంధోపాధ్యాయ్ పేర్కొన్నారు. దానికి తగిన ప్రయత్నాలను మొదలుపెట్టామని, తొలిసారిగా సొంతంగా ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్టు చెప్పారు. ఇదివరకు వచ్చిన పథకాల్లో ఎటువంటి హమీ లేదు, మార్కెట్ నుంచి వచ్చిన దాన్నే వినియోగదారులకు బదిలీ చేస్తున్నామని, దీంతో పెట్టుబడులతో నష్టాలు ఉంటాయనే ఆందోళన వినియోగదారుల్లో ఉండేదని బంధోపాధ్యాయ్ వివరించారు. జాతీయ పెన్షన్ పథకం, అటల్ పెన్షన్ యోజన పథకాలు ఆర్థిక శాఖతో చర్చించిన తర్వాత తీసుకొచ్చారు. ఈ రెండింటికి పీఎఫ్ఆర్‌డీఏ ఇతర ఫీచర్లను జోడించింది. ఈ పథకాలకు ఇప్పటివరకు హామీ లేదు, కనీస హామీతో కూడిన రిటర్న్ ఆధారిత పెన్షన్ పథకం తీసుకువస్తే సరికొత్త పథకం అవుతుందని బంధోపాద్యాయ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed