సాయానికి మరోసారి కదిలిన నెటిజన్లు

by Shyam |
సాయానికి మరోసారి కదిలిన నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్ :
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా పవర్ ఏంటో చూస్తూనే ఉన్నాం. ‘బాబా కా దాబా’ సాయంతో మొదలైన సోషల్ మీడియా పిలుపు.. ఇంకా కొనసాగుతూనే ఉంది. సాయం కావాల్సి వస్తే.. మేమున్నామంటూ ఎంతోమంది తరలివస్తున్నారు. తమకు చేతనైనా సాయం చేసి ఇంకా మానవత్వం పరిమళిస్తూనే ఉందని నిరూపిస్తున్నారు. తాజాగా బెంగళూరులో.. ఓ వృద్ధుడు ఎండలో రోడ్డు మీద కూర్చుని మొక్కలు అమ్ముకుంటుండగా.. చూసి చలించిన ఓ నెటిజన్.. వెంటనే అతడి ఫోటో తీసి సాయం చేయాల్సిందిగా కోరుతూ ట్వీట్‌ చేశాడు. దాంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు స్పందించి ఆ పెద్దాయనకు సాయం అందించారు.

‘కర్ణాటక సరక్కి సిగ్నల్‌, కనకపురి రోడ్డులో రేవన సిద్దప్ప అనే ఓ తాత మొక్కలు అమ్ముకుంటున్నాడు. ఒక్కో మొక్క ధర 10-30 రూపాయలు మాత్రమే. అతనికి సాయం చేయండి’ అంటూ ట్విట్టర్ యూజర్‌ శుభమ్‌ జైన్ వృద్ధుడికి సంబంధించిన రెండు ఫొటోలను ట్వీట్‌ చేశాడు. కాసేపట్లోనే ఈ ట్వీట్ వైరల్ కాగా బాలీవుడ్ నటుడు రణదీప్‌ హుడా కూడా రెస్పాండ్ అయ్యాడు. ‘హే బెంగళూరు.. కొంత ప్రేమను చూపించు. ఈ వృద్ధుడు సరక్కి సిగ్నల్, జేపీ నగర్‌లో ఉన్న వులర్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ ముందు కూర్చున్నాడు’ అంటూ వృద్ధుడికి మద్దతు ఇవ్వాల్సిందిగా తన అభిమానులను కోరారు రణదీప్‌ హుడా. హీరో మాధవన్‌, ఆర్జే అలోక్‌ వంటి పలువురు ప్రముఖులు కూడా ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు.

‘చేంజ్‌ మేకర్స్‌ ఆఫ్‌ కనకపుర రోడ్‌’ అనే ఎన్జీఓ సంస్థ, రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమాఖ్య.. సిద్దప్పకు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. అతడి కోసం ఓ గొడుగు, టేబుల్‌, కుర్చీతో పాటు అమ్మడానికి మరిన్ని మొక్కలు అందించారు.

Advertisement

Next Story

Most Viewed