వచ్చే ఏడాదిలో ఆ వస్తువుల ధరలకు రెక్కలు..

by Harish |
nestly
X

దిశ, వెబ్‌డెస్క్: 2022లో వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లె ఇండియా చీఫ్ సురేష్ నారాయణన్ అన్నారు. తయారీదారులు ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో వచ్చే ఏడాది తమకు కొంత కఠినంగా ఉండనున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. గడిచిన 6-8 నెలల కాలంలో వస్తువుల ధరలు సగటున 1-3 శాతం మధ్య పెరిగాయని, అయితే, ప్రస్తుత ఏడాది ప్రథమార్థంలో ధరలు కొంత స్థిరంగా ఉన్నాయని సురేష్ నారాయణన్ తెలిపారు. ముఖ్యంగా ప్యాకింగ్ మెటీరియల్స్, ముడి చమురు, పాలు, గోధుమల వంటి ధరల పెరుగుదల పెద్దగా లేదని, కానీ 2022లో పరిస్థితులు కొంత క్లిష్టంగా మారొచ్చని సురేష్ నారాయణన్ పేర్కొన్నారు.

సరఫరా వ్యవస్థలో ఇబ్బందుల కారణంగా పాల ధరలు ఖచ్చితంగా పెరుగుతాయనే సంకేతాలు కనబడుతున్నాయని, అలాగే, అత్యధికంగా కాఫీని పండించే వియత్నాంలో ప్రతికూల పరిణామాల కారణంగా కాఫీ ధరలు గణనీయంగా పెరుగుతాయని ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరల్లో దాదాపు 5 శాతం పెరుగుదల ఉండగా, ఇది రానున్న రోజుల్లో మరింత ప్రభావం చూపనున్నట్టు సురేష్ నారాయణన్ వివరించారు. అయితే దేశీయంగా రబీ పంట మెరుగ్గా, రుతుపవనాలు బలంగా ఉండటంతో వ్యవసాయ రంగానికి సంబంధించి కొంత ఉపశమనం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story