- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rythu Bandhu: ‘రైతుబంధు’ ఖాతా అప్‌డేట్ చేయాలా.. వద్దా..?
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రైతుబంధు పెట్టుబడి సాయంపై ప్రభుత్వం తరుపున వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు స్పష్టతనిచ్చారు. వచ్చేనెల 15 నుంచి రైతుబంధు (Rythu Bandhu) సాయం అందిస్తామని ప్రభుత్వం వెల్లడించిన నేపథ్యంలో ఖాతా నెంబర్ల అంశంపై చాలా పుకార్లు వస్తున్నాయి. పలు బ్యాంకులు విలీనం కావడంతో ఖాతా నెంబర్లు మార్చుకోవాలని, వివరాలను మళ్లీ వ్యవసాయాధికారులకు ఇవ్వాలంటూ వ్యవసాయ శాఖ పేరుతో సోషల్ మీడియాలో ప్రకటన వైరల్ అయింది. ఈ నేపథ్యంలో చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
దీనిపై వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావును ‘దిశ’ వివరణ కోరగా… పలు అంశాలను వెల్లడించారు.రైతుబంధు సాయంపై గందరగోళం వద్దంటూ సూచించారు. ప్రస్తుతం బ్యాంకు ఖాతాలను అప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదని, దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. రైతులు సమర్పించిన ఖాతాల్లోనే రైతుబంధు నగదు జమ అవుతుందని, ఏమైనా మార్పులు ఉంటే అధికారికంగా వెల్లడిస్తామంటూ చెప్పుకొచ్చారు.
ఏది నిజం..?
వాస్తవానికి ఆరు బ్యాంకులు విలీనం కావడంతో రైతులు మళ్లీ వివిధ డాక్యుమెంట్లు సమర్పించి, అప్‌డేట్ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ పేరుతో ఒక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, దేనా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, విజయా బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న రైతులు మళ్లీ కొత్తగా ఇచ్చిన బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదారు పాస్ బుక్ జిరాక్సులను వ్యవసాయాధికారులకు సమర్పించాలంటూ వైరల్ అయింది. అయితే దీనిపై ఎక్కడా క్లారిటీ రావడం లేదు. మరోవైపు ఇప్పటికే పీఎం కిసాన్ యోజన ఆర్థిక సాయం ఈ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న రైతులకు కూడా జమ అయింది. దీంతో కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ మరో ప్రచారం వచ్చింది.
అయితే ఈ బ్యాంకులు విలీనం అయినా జూన్ 1 వరకు ఖాతాదారులకు పాత ఖాతా నెంబర్లు, ఐఎఫ్ఎస్సీ నెంబర్లనే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. అందుకే కొత్త పాస్ పుస్తకాలు విడుదల చేయలేదు. ఇప్పుడు కరోనా సమయంలో బ్యాంకులు కొద్ది సమయం పని చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో రైతులు మళ్లీ బ్యాంకులకు వెళ్లి కొత్త పాస్‌పుస్తకాలు తీసుకుని వ్యవసాయ శాఖకు దరఖాస్తు చేసుకోవాలంటే చాలా సమయం పడుతోంది. అందుకే పాత ఖాతా నెంబర్లతోనే కొనసాగిస్తారని అటు బ్యాంకర్లు చెప్పుతున్నారు.
కానీ వ్యవసాయ శాఖ కిందిస్థాయి అధికారులు మాత్రం రైతులు మళ్లీ అప్‌డేట్ చేయించుకోవాలంటూ గ్రామాల్లో చెబుతున్నట్లు తెలుస్తోంది. కానీ విలీనం అయిన బ్యాంకులకు సంబంధించిన కొత్త పాస్ పుస్తకాలు ఇంకా విడుదల చేయలేదు. దీంతో ఇప్పుడు ఎలా అప్‌డేట్ చేయించుకోవాలనేది చిక్కు ప్రశ్నగా మారింది. మరికొంతమంది వ్యవసాయాధికారులు మాత్రం మండలాల వారీగా వ్యవసాయ శాఖ ఏవోలకు వ్యాట్సాప్‌లో బ్యాంకు పాసు పుస్తకం, ఆధార్‌కార్డు, పట్టా పాస్‌బుక్ జిరాక్స్ ఫొటోల రూపంలో పంపిస్తే అప్‌డేట్ అవుతుందంటున్నారు. దీనిపై కచ్చితమైన ప్రకటన ఎక్కడ నుంచి రావడం లేదు. దీంతో రైతుబంధు నగదు సాయంపై చాలా గందరగోళం ఏర్పడుతోంది.
మరోవైపు ఒక్కసారి రైతుబంధు నగదు సొమ్ము ఖాతాల్లో ఆగిపోతే మళ్లీ రావడం కష్టమవుతోంది. ఇప్పటి వరకు తొలిసారి ఇచ్చిన చెక్కులే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. గత యాసంగిలో కూడా ఖాతా నెంబర్లు, ఐఎఫ్ఎస్సీ నెంబర్ల గందరగోళంతో ఆగిపోయినట్లు చెప్పుతున్నారు. అందుకే ఎందుకైనా మంచిదే అన్నట్టుగా రైతులు అప్‌డేట్ చేయించుకోవాలంటూ కొంతమంది చెప్పుతున్నారు. కానీ కొత్త పాస్ పుస్తకాలు రాకపోవడంతో ఎలా అప్‌డేట్ చేయించుకుంటామని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు కొంత మేరకు వివరణ ఇచ్చారు. బ్యాంకు ఖాతాలను అప్‌డేట్ చేయించుకోవాల్సిన అవసరం లేదంటూ సూచించారు.
కాగా విలీనమైన బ్యాంకుల పరిధిలో చాలా మంది రైతుల ఖాతాలున్నాయి.
ఆంధ్రాబ్యాంకు పరిధిలో 26,89,156 మంది రైతులు, సిండికేట్ బ్యాంకులో 9,03,696 మంది, కార్పొరేషన్ బ్యాంకులో 3,15,277 మంది, ఓరియంటల్ బ్యాంకులో 6,01,562 మంది రైతులతో పాటుగా విజయాబ్యాంకు, దేనా బ్యాంకుల పరిధిలో రెండున్నర లక్షల మంది రైతుల ఖాతాలు ఉన్నాయి. వీరంతా ఇప్పటికిప్పుడు కొత్త పాస్‌పుస్తకాలతో దరఖాస్తు చేసుకోవాలంటే దాదాపు నెల రోజులకుపైనే పడుతోంది. ఈ విలీనం అయిన బ్యాంకులు కొత్త పాస్ పుస్తకాలను ఇంకా జారీ చేయడం లేదు. జూన్ 1 తర్వాతే ఇస్తామని గతంలోనే ప్రకటించాయి. ఇప్పుడు కరోనా లాక్‌డౌన్‌తో కొత్త పాసు పుస్తకాలు ఇవ్వడం సాధ్యం కాదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పాత ఖాతాల ఆధారంగానే రైతుబంధు జమ అవుతుందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్పుతున్నారు.