చిక్కుల్లోపడిన TRS ఎమ్మెల్యే చల్లా.. చర్యలు తప్పవా.?

by Anukaran |
Challa-Dharma-reddy
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డికి భారీ షాక్ తగిలింది. ద‌ళిత ప్రజాప్రతినిధులైన జ‌డ్పీటీసీ, ఎంపీపీల‌కు క‌నీస గౌర‌వం ఇవ్వకుండా వారిని కించ‌ప‌రిచే విధంగా అఖిల‌ప‌క్ష సమావేశంలో నిల్చోబెట్టిన‌ట్లుగా పేర్కొంటూ ఏఐసీసీ నేత బ‌క్క జ‌డ్సన్ నేష‌న‌ల్ క‌మిష‌న్ ఫ‌ర్ షెడ్యూల్ క్యాస్ట్(ఎన్‌సీ‌ఎస్‌సీ)కి సోమవారం ఫిర్యాదు చేశారు. అమానుషంగా వ్యవ‌హ‌రించిన ప‌ర‌కాల ఎమ్మెల్యేపై త‌గు చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరుతూ క‌మిష‌న్ చైర్మన్ విజ‌య్ సంప్లాను జ‌డ్సన్ ఫిర్యాదులో కోరారు.

జ‌డ్పీటీసీ సిలువేరు మొగిలి, ఎంపీపీ త‌క్కళ్లప‌ల్లి స్వర్ణల‌త.. ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి వెనుకాల నిల్చోని, చేతులు క‌ట్టుకున్న దృశ్యాల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చని తెలిపారు. ఇది ఎమ్మెల్యే ద‌ళితుల‌పై అనుస‌రిస్తున్న విధానానికి నిద‌ర్శన‌మ‌ని పేర్కొన్నారు. ప‌ర‌కాల‌ను అమ‌ర‌వీరుల జిల్లాగా ప్రక‌టించాల‌ని డిమాండ్ చేస్తూ కొద్దిరోజులుగా ఉద్యమం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో గ‌త శ‌నివారం రాత్రి ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి అధ్యక్షత‌న జిల్లా సాధ‌న స‌మితితో పాటు అఖిల‌ప‌క్షం నేత‌లతో చ‌ల్లా స‌మావేశం నిర్వహించారు.

అయితే ఈ స‌మావేశంలో ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన‌ ప‌ర‌కాల ఎంపీపీ స్వర్ణల‌త‌, జ‌డ్పీటీసీ సిలువేరు మొగిలిలు ఎమ్మెల్యే సీటు వెనుకాల చేతులు క‌ట్టుకుని నిల్చున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ అంశంపై మీడియాలో కూడా క‌థ‌నాలు రావ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. గ‌తంలోనూ ద‌ళితుల‌పై ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. తాజా ఘ‌ట‌న‌తో మ‌రోమారు ఎమ్మెల్యే చ‌ల్లా వివాదంలో చిక్కుకున్నార‌నే చెప్పాలి. దీనిపై ఎన్‌సీ‌ఎస్‌సీ క‌మిష‌న‌ర్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

jadsan

Advertisement

Next Story

Most Viewed