అధినేతపై నాయిని గుస్సా..

by Shyam |   ( Updated:2020-03-10 08:04:42.0  )
అధినేతపై నాయిని గుస్సా..
X

దిశ, న్యూస్ బ్యూరో : అధికార పార్టీలో పదవుల లొల్లి మరోమారు రచ్చకెక్కింది. అంతర్గత పంచాయితీ కాస్తా రోడ్డెక్కుతోంది. పదవులు ఆశించి భంగపడ్డవారు అగ్రనేతలపై గొంతుచించుకుంటున్నారు. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తనకు ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు ఇస్తానంటే ఊరుకునేది లేదు, రాజ్యసభ టికెట్ ఇవ్వాలి.. ఎట్లా ఇవ్వరో చూస్తానంటూ గట్టిగానే వాదిస్తున్నాడు.
రాష్ర్టంలో రెండు రాజ్యసభ పదవులు, ఒక ఎమ్మెల్సీ పదవి ఖాళీ ఏర్పడడంతో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా వేసిన విషయం విదితమే. అధికార పార్టీ నేతల దృష్టి మొత్తం ఈ రెండు రాజ్యసభ టికెట్ల మీదనే ఉంది. రెండు సీట్లల్లో ఒకటి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావుకు కేటాయించినట్లు తెలుస్తోంది. రెండో వ్యక్తి కోసం అన్వేషణ కొనసాగుతున్నదంటున్నారు. ఈ నెల 11న లేదా 12న అభ్యర్ధుల పేర్లను ప్రకటించనున్నట్లు సమాచారం. రెండో టికెట్ కోసం ముగ్గురు నలుగురి పేర్లు పరిశీలనలో ఉండడంతో ఆశావహులు పైరవీలు చేసుకుంటున్నారు..
రాష్ర్టంలో టీఆర్ఎస్ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కేబినెట్‌లో నాయిని నర్సింహారెడ్డికి చోటు దక్కలేదు. ఇంత కంటే మంచి పదవి వస్తుందిలే అని సీఎం అప్పట్లో ఆయనకు సర్దిచెప్పారు. ఉన్న ఎమ్మెల్సీ పదవీకాలం కూడా దగ్గర పడుతుండడంతో తనకు రాజ్యసభ టికెట్ ఇవ్వాలని కేసీఆర్‌ను కలిసి కోరినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఇటీవల నాయిని ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య మీడియా సమావేశాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. రాజ్యసభ టికెట్ కాకుండా కార్పొరేషన్ చైర్మన్ లేదా మరోమారు ఎమ్మెల్సీ ఇవ్వాలన్న ఆలోచనతో పార్టీ అగ్రనాయకులు ఉన్నట్లు తెలువడంతో తాజాగా ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ‘‘మా పునాదుల మీద నిర్మించిన భవనంలో మాకు చోటు ఇవ్వకపోవడమేంది.. నాకు రాజ్యసభ టికెట్ ఎట్లా ఇవ్వడో చూస్తానంటూ’’ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

Advertisement

Next Story