మోడీ అమెరికా పర్యటన మరింత ముందుకు

by John Kora |
మోడీ అమెరికా పర్యటన మరింత ముందుకు
X

- ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం

- ఎంఈఏ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్

దిశ, నేషనల్ బ్యూరో:

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనను షెడ్యూల్ కంటే మరింత ముందుకు జరిపేందుకు విదేశాంగ శాఖ ప్రయత్నిస్తోంది. అమెరికా-ఇండియా మధ్య సమగ్రమైన ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటనను ఉపయోగించుకోనున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మీడియాకు తెలిపారు. మోడీ ముందస్తు పర్యటనకు సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదని, అమెరికా అధికారులతో ప్రస్తుతానికి చర్చలు జరుపుతున్నామని రణ్‌ధీర్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగిన తర్వాత ఎంఈఏ ఈ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు నేతలు కూడా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై టెలిఫోన్‌లో సంభాషించుకున్నట్లు తెలిసింది. కాగా, డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన తర్వాత ప్రధాని మోడీ 'ఎక్స్' వేదికగా స్పందించారు. తన ప్రియమైన స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. రెండో సారి అమెరికాకు అధ్యక్షుడు అయినందుకు అభినందనలు తెలిపారు. ఇరు దేశాలు పరస్పరం లబ్ది పొందేలా నమ్మకమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని మోడీ పేర్కొన్నారు. ఇండియా, అమెరికాలోని ప్రజల సంక్షేమం, ప్రపంచ శాంతి, రక్షణ, శ్రేయస్సు కోసం కలిసి పని చేస్తామని మోడీ అన్నారు.


Next Story