- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చంద్రుడిపై మానవుడిని దించేందుకు భారత్ రెడీ

- డాకింగ్ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించిన ఇస్రో
- భారత అంతరిక్ష ప్రయోగాల్లో కీలక మలుపు
- సొంతగా అంతరిక్ష కేంద్రం నిర్మించేందుకు సిద్ధం
దిశ, నేషనల్ బ్యూరో:
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇప్పటి వరకు అగ్రదేశాలకే పరిమితం అయిన డాకింగ్ (అంతరిక్షంలో రెండు పరికరాల అనుసంధానం) టెక్నాలజీ ఇప్పుడు భారత్ వశమైంది. ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ ఎక్స్‌పరిమెంట్ (స్పేడెక్స్) మిషన్ విజయవంతం అయ్యింది. అంతరిక్షంలో రెండు శాటిలైట్లను గురువారం విజయవంతంగా అనుసంధానం చేసింది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే పరిమితం అయిన ఈ క్లిష్టమైన టెక్నాలజీని భారత్ కూడా అందిపుచ్చుకుంది. శాటిలైట్ డాకింగ్ విజయవంతంగా పూర్తి చేయడంతో భవిష్యత్‌లో భారత్ చేపట్టబోయే కీలక అంతరిక్ష ప్రయోగాలకు మార్గం సుగమం కానుంది.
డాకింగ్ ఎలా చేస్తారు?
అంతరిక్షంలో అత్యంత వేగంగా తిరుగుతున్న రెండు శాటిలైట్లు లేదా ఒక రాకెట్‌ను స్పేస్ సెంటర్‌కు అనుసంధానం చేయడాన్ని డాకింగ్ అంటారు. ఇస్రో ఇప్పుడు ఈ టెక్నాలజీని ప్రయోగించడానికి రెండు శాటిలైట్లను డిసెంబర్ 30 అంతరిక్షంలోకి పంపించింది. ఇందులో ఎస్‌డీఎక్స్01 అనే ఛేజర్ శాటిలైట్, ఎస్‌డీఎక్స్02 అనే టార్గెట్ శాటిలైట్ ఉన్నాయి. ఇస్రో గత నెల అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపినప్పుడు రెండింటి మధ్య 20 కిలోమీటర్ల దూరం ఉండేలా కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ శాటిలైట్ల మధ్య దూరాన్ని మొదటిగా 5 కిలోమీటర్లు, తర్వాత 1.5 కిలోమీటర్లకు, 500 మీటర్లు, 225 మీటర్లు, 15 మీటర్లు, 3 మీటర్ల దగ్గరకు తీసుకొని వచ్చేలా షెడ్యూల్ చేశారు. రెండింటిలో టార్గెట్ శాటిలైట్ స్థిరంగా ఉండగా.. ఛేజర్ శాటిలైట్‌ను మానూవర్ ద్వారా దగ్గరకు తీసుకొని వస్తారు. ఛేజర్ శాటిలైట్‌ను చాలా జాగ్రత్తగా 3 మీటర్ల దగ్గరగా ఉండే హోల్డ్ పాయింట్ దగ్గరకు తీసుకొని వచ్చారు. అక్కడ నుంచి ఛేజర్ శాటిలైట్ ఆటోమెటిక్‌గా డాక్ అయ్యింది.
ఇస్రో సాంకేతికత చాలా చీప్.!
టార్గెట్, ఛేజర్ శాటిలైట్లను మూడు మీటర్ల దగ్గరకు తీసుకొని వచ్చి హోల్డ్ పాయింట్‌లో వదిలేసిన తర్వాత రెండింటిలో ఉండే అడ్వాన్స్‌డ్ సెన్సార్లు తమ పని తాము చేసుకొని పోతాయి. లాజర్ రేంజ్ ఫైండర్, డాకింగ్ సెన్సార్లు ఉపయోగించుకొని ఛేజర్ శాటిలైట్ తనంతట తానే టార్గెట్ శాటిలైట్ డాకింగ్ మెకానిజంతో అనుసంధానం అయ్యింది. రెండు శాటిలైట్లలో ఐడెంటికల్ ఆండ్రోజీనియస్ సిస్టమ్స్ ఉండేలా డిజైన్ చేశారు. ఇది రెండు ముందుగా కనెక్ట్ అవుతాయి. రెండు శాటిలైట్లు అత్యంత దగ్గరగా వచ్చి కనెక్షన్ ఏర్పాటు చేసుకునే వరకు ఈ వ్యవస్థ పని చేస్తుంది.
సాధారణంగా అంతరిక్షంలో అనుసంధానం అయ్యే స్పేస్ క్రాఫ్ట్స్‌లో ఒక మేల్, మరో ఫీమేల్ డాకింగ్ మెకానిజం ఉంటుంది. రెండు మేల్, రెండు ఫీమేల్ ఉంటే అవి అనుసంధానం కావు. అయితే ఇస్రో మాత్రం లేటెస్ట్ టెక్నాలజీని వాడింది. ఇందులో ఆండ్రోజీనియస్ మెకానిజం ఉపయోగించారు. మేల్, ఫీమేల్ అంటూ ఉండవు. అదే సమయంలో ఆండ్రోజీనియస్ వ్యవస్థ ఉండే ఏ స్పేస్ క్రాఫ్ట్‌తో అయినా ఇది అనుసంధానం అవుతుంది. రాబోయే రోజుల్లో భారత్ స్పేస్ స్టేషన్ నిర్మించాలని భావిస్తోంది. అప్పుడు మల్టిపుల్ మాడ్యుల్స్‌ను అనుసంధానం చేయడానికి ఆండ్రోజీనియస్ సిస్టమ్ ఉపయోగపడుతుంది.
ఇక సాధారణంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు ఏదైనా స్పేస్ క్రాఫ్ట్ అనుసంధానం కావాలంటే 24 మోటార్లను ఉపయోగించి మానువర్ చేస్తారు. కానీ ఇస్రో మాత్రం కేవలం రెండు మోటార్లు మాత్రమే ఉపయోగించి అత్యంత క్లిష్టమైన ఈ ప్రక్రియను పూర్తి చేసింది. దీని వల్ల డాకింగ్ టెక్నాలజీ కాస్ట్ గణనీయంగా తగ్గిపోయింది.
గగన్‌యాన్, చంద్రయాన్ 4కు అత్యంత కీలకం..
ఇస్రో తమ డాకింగ్ టెక్నాలజీని విజయవంతంగా పూర్తి చేయడంతో భవిష్యత్ ప్రయోగాలపై ఆశలు మరింతగా పెరిగాయి. 2035 కల్లా భారతీయ అంతరిక్ష్ స్టేషన్‌ను నిర్మించాలని ఇస్రో భావిస్తోంది. దీనికి డాకింగ్ టెక్నాలజీ అత్యంత కీలకంగా ఉండనుంది. అంతరిక్షంలో అత్యంత వేగంగా తిరిగే మాడ్యూల్స్‌ను అనుసంధానం చేయడానికి భారత్ వద్ద ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు 2040 కల్లా చంద్రుని మీదకు వ్యోమోగాములను పంపాలని ఇస్రో భావిస్తోంది. తాజాగా వచ్చిన డాకింగ్ టెక్నాలజీ వల్ల చంద్రయాన్ 4కు మార్గం సుగమమం అయ్యింది.
రెండు వేర్వేరు రాకెట్ల ద్వారా రెండు మాడ్యూల్స్‌ను అంతరిక్షంలోకి పంపిస్తారు. ఇవి రెండూ చంద్రుని దగ్గరకు ప్రయాణిస్తాయి. ఒక మాడ్యూల్ చంద్రుని స్థిర కక్ష్యలో ఉండగా.. మరో మాడ్యుల్ మాత్రం చంద్రునిపై దిగుతుంది. అక్కడ చంద్రుని నేల నుంచి మట్టిని సేకరించి తిరిగి చంద్రుని కక్ష్యలోకి చేరుతుంది. అక్కడే వేచిఉన్న మరో మాడ్యూల్‌తో అనుసంధానం అయ్యి.. సేకరించిన శాంపిల్స్‌ను మరో దాంట్లోకి చేరుస్తుంది. మొదటి మాడ్యూల్ చంద్రుని స్థిర కక్ష్యలో పార్కింగ్ చేసి అక్కడే ఉంచుతారు. రెండో మాడ్యుల్ మాత్రం శాంపిల్స్ తీసుకొని భూమి మీదకు వస్తుందని ఇస్రో అధికారులు చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ డాకింగ్ టెక్నాలజీ ఉపయోగించి అనేక ప్రయోగాలు చేయాల్సి ఉందని.. తాజాగా దీన్ని విజయవంతగా ప్రయోగించడం ఇస్రో చరిత్రలో ఒక కీలక ఘట్టమని ఇస్రో శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.