ఢిల్లీ కొత్త సీఎం ఎవరు.. ఆప్ కీలక ప్రకటన

by Hajipasha |
ఢిల్లీ కొత్త సీఎం ఎవరు.. ఆప్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్టు చేసింది. ఈనేపథ్యంలో కేజ్రీవాల్ జైలు పాలైతే.. ఢిల్లీ సీఎం ఎవరు అవుతారు అనే దానిపై చర్చ మొదలైంది. కేజ్రీవాల్ అరెస్టయిన వెంటనే అత్యవసరంగా భేటీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇదే టాపిక్‌పై చర్చించారు. కేజ్రీవాల్ భార్యకు సీఎం పదవిని అప్పగించడమా ? ఎవరైనా సీనియర్ మంత్రికి అప్పగించడమా ? అనే దానిపై ఈ మీటింగ్‌లో చర్చించినట్లు తెలిసింది. జైలు నుంచి ముఖ్యమంత్రిగా పరిపాలన నిర్వహించడంలో సమస్యలు ఉన్నట్లు ఈ భేటీలో కొందరు ఆప్ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఆప్ నేతల మీటింగ్ అనంతరం ఢిల్లీ ప్రభుత్వంలో నంబర్ 2గా కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి ఆతిషి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘జైల్లో ఉన్నా సీఎంగా కేజ్రీవాలే కొనసాగుతారు. మొదటి నుంచీ ఆయన చెబుతున్నది అదే. అందులో రెండో ఆలోచన లేదు. జైలు నుంచి సీఎంగా పనిచేసే విషయంలో కేజ్రీవాల్‌ను ఏ చట్టమూ ఆపలేదు. లిక్కర్ స్కాంలో ఆయన ఇంకా దోషిగా తేలలేదు’’ అని ఆతిషి స్పష్టం చేశారు.

ఇండియా కూటమి నేతలు ఏమన్నారంటే..

‘‘లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడం వెనక రాజకీయ కుట్ర ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వ్యతిరేకంగా గట్టిగా కొట్లాడే వ్యక్తిగా కేజ్రీవాల్‌కు గుర్తింపు ఉంది. దాన్ని చూసి మోడీ భయపడుతున్నారు. ఇండియా కూటమి తరఫున ప్రచారం చేస్తే ఎన్డీఏ ఇమేజ్ తగ్గిపోతుందన్నది మోడీ భయం. ఒక్క కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే వెయ్యి మంది పుట్టుకొస్తారు. మోడీ రాజకీయాలతో కేజ్రీవాల్ యుద్ధం చేస్తున్నారు. అందుకే న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం’’ అని ఢిల్లీ మంత్రి ఆతిషి పేర్కొన్నారు. ఇక కేజ్రీవాల్ అరెస్టు అన్యాయం, అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ విమర్శించారు. కేజ్రీవాల్ అరెస్టును ఇండియా కూటమి నేతలు ఎంకే స్టాలిన్ (డీఎంకే), అఖిలేష్ యాదవ్ (సమాజ్ వాదీ పార్టీ), డెరెక్ ఓబ్రెయిన్ (టీఎంసీ) ఖండించారు.

Advertisement

Next Story