Waqf act: వక్ఫ్ చట్టాన్ని సవరించాలి.. జేపీసీకి క్రైస్తవ సంస్థల లేఖ

by vinod kumar |
Waqf act: వక్ఫ్ చట్టాన్ని సవరించాలి.. జేపీసీకి క్రైస్తవ సంస్థల లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో:1995 నాటి వక్ఫ్ చట్టాన్ని సవరించాలని సైరో మలబార్ చర్చి, కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్‌లు డిమాండ్ చేశాయి. ఈ మేరకు చట్టాన్ని సవరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి ఆదివారం లేఖ రాశాయి. ‘కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని చెరై, మునంబమ్ గ్రామాల్లో తరతరాలుగా క్రైస్తవ కుటుంబాలకు చెందిన అనేక ఆస్తులను వక్ఫ్ బోర్డు చట్టవిరుద్దమైనవిగా గుర్తించింది. ఇలాంటి ఆరోపణలు వెల్లువెత్తడంతో యజమానులు న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రాంతం నుంచి ప్రజలను వెళ్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల సుమారు 600 కుటుంబాలకు ప్రమాదం పొంచి ఉంది. వీరంతా పేద మత్య్సకారుల వర్గానికి చెందిన వారు. కాన్వెంట్, డిస్పెన్సరీని తరలించే ప్రమాదం ఉంది’ అని లేఖలో పేర్కొన్నారు. ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని జేపీసీని అభ్యర్థించింది. రాజ్యాంగ సూత్రాల ఆధారంగా వక్ప్ చట్టం 1995ని సవరించాలని కోరారు. ఇళ్లు కోల్పోయిన వారి పరిస్థితిని కమిటీ పరిశీలించాలని సూచించారు. వక్ఫ్ చట్టంలోని నిబంధనలను కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. భవిష్యత్‌లో దేశమంతా ఈ తరహా ఘటనలు జరగకుండా రూల్స్ సవరించడం, రద్దు చేయడం గురించి ఆలోచించాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story