- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Jaishankar : పాలస్తీనా అంశం.. భారత్ వైఖరిపై పార్లమెంటులో ఎస్.జైశంకర్ వివరణ

దిశ, నేషనల్ బ్యూరో : పాలస్తీనా(Palestine)కు మద్దతుగా నిలిచే వైఖరినే సుదీర్ఘకాలంగా భారత్ అవలంబిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్(Jaishankar) స్పష్టం చేశారు. చర్చల ద్వారా ఇజ్రాయెల్ - పాలస్తీనాలను రెండు వేర్వేరు దేశాలుగా ఏర్పాటు చేస్తేనే పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి స్థాపనకు అవకాశం ఉంటుందన్నారు. ఈ దిశగా జరిగే ప్రతీ ప్రయత్నానికి తప్పకుండా భారత్ మద్దతు ఉంటుందన్నారు. సార్వభౌమాధికారం, స్వతంత్రత కలిగిన పాలస్తీనా దేశం ఏర్పాటు కావాలని మొదటి నుంచీ భారత్ కోరుకుంటోందని ఆయన వెల్లడించారు. గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సెషన్ జరిగింది. ‘‘పాలస్తీనాలోని గాజా ప్రాంతంతో ముడిపడిన తీర్మానాలపై ఐక్యరాజ్య సమితి(యూఎన్)లో జరుగుతున్న ఓటింగ్‌కు భారత్ ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉంటోందా ?’’ అని ప్రభుత్వాన్ని ఓ సభ్యుడు ప్రశ్నించారు. దీనికి జైశంకర్ బదులిస్తూ.. ‘‘2023 సంవత్సరం అక్టోబరు 7న ఇజ్రాయెల్ - హమాస్ సంక్షోభం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు గాజా (పాలస్తీనా)కు సంబంధించిన 13 తీర్మానాలపై ఐరాస జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. వాటిలో 10 తీర్మానాలకు అనుకూలంగా భారత్ ఓటు వేసింది. కేవలం మూడు తీర్మానాలపై ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాం’’ అని వెల్లడించారు.
ఇజ్రాయెలీ బందీల అంశం తీవ్రమైంది
‘‘గాజా(Gaza)పై చేసే ఏ తీర్మానంలోనైనా ఉగ్రవాదం, హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెలీ బందీల అంశాన్ని ప్రస్తావించకపోతే అది వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించదు’’ అని ఆయన తేల్చి చెప్పారు. ‘‘భారత్ స్వయంగా ఉగ్రవాద బాధిత దేశం. అందుకే ఉగ్రవాదాన్ని విస్మరించడం అనేది మన దేశ ప్రయోజనాలకు విరుద్ధం. ఉగ్రవాదాన్ని, ప్రజలను బంధించడాన్ని భారత్ ఖండిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశానికైనా ప్రతిస్పందించే హక్కు ఉంటుంది. అయితే ఆయా దేశాలు సాధారణ పౌరుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకోవాలి. మానవీయ చట్టాలు, కాల్పుల విరమణ, హింస ముగింపునకు భారత్ మద్దతు ఇస్తుంది’’ అని విదేశాంగ మంత్రి చెప్పారు. ‘‘జాతీయ భద్రతా ప్రయోజనాల విషయంలో ఇజ్రాయెల్‌తో భారత్‌కు బలమైన బంధం ఉంది. మన భద్రత ప్రమాదంలో పడిన సందర్భాల్లో అండగా నిలిచిన దేశం అది’’ అని జైశంకర్ గుర్తుచేశారు.
యూఎన్ఆర్‌డబ్ల్యూఏకు సాయం చేస్తున్నాం
ఇజ్రాయెల్‌లో ‘యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్ ఇన్ నార్త్ ఈస్ట్’ (యూఎన్ఆర్‌డబ్ల్యూఏ) సంస్థను బ్యాన్ చేయడంపై భారత్ వైఖరిని చెప్పాలని టీఎంసీ నేత సాకేత్ గోపాల్ కోరారు. వెస్ట్‌బ్యాంక్‌లో అక్రమ సెటిల్మెంట్లపైనా స్పందించాలని విదేశాంగ మంత్రిని కోరారు. జైశంకర్ బదులిస్తూ.. ‘‘యూఎన్ఆర్‌డబ్ల్యూఏ సంస్థకు భారత్ మద్దతు ఇస్తుంది. మేం ఆ సంస్థకు సాయం చేస్తూనే ఉన్నాం. ఏటా ఐదు మిలియన్ డాలర్ల సాయం అందిస్తున్నాం. పాలస్తీనా ప్రజలకు అవసరమైన సాయం భారత్ నుంచి అందుతోంది. 70 మెట్రిక్ టన్నుల సహాయ సామగ్రి, 16.5 మెట్రిక్ టన్నుల ఔషధాలను పంపాం’’ అని వివరించారు.