112 మంది అక్రమ వలసదారులతో అమెరికా మూడో ఫ్లైట్.. సంకెళ్లతోనేనా?

by Mahesh Kanagandla |
112 మంది అక్రమ వలసదారులతో అమెరికా మూడో ఫ్లైట్.. సంకెళ్లతోనేనా?
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా నుంచి మూడో బ్యాచ్ అక్రమ వలసదారుల ఫ్లైట్ పంజాబ్‌లోని అమృత్‌సర్ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. 112 మంది అక్రమ వలసదారులతో ఆదివారం రాత్రి అమెరికా మిలిటరీ ఫ్లైట్ అమృత్‌సర్ చేరుకుంది. రాత్రి 10.03కు ఈ సీ-17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ అమృత్‌సర్ చేరుకున్నట్టు తెలిసింది. మూడో బ్యాచ్‌లో వెనక్కి వచ్చిన పౌరుల్లో అత్యధికులు హర్యానా వాసులు.హర్యానా నుంచి 44 మంది, గుజరాత్ నుంచి 33 మంది, పంజాబ్ నుంచి 31 మంది, ఇద్దరు యూపీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. కొందరి కుటుంబాలు వారిని తీసుకెళ్లడానికి ఇప్పటికే ఎయిర్‌పోర్టు చేరుకున్నాయి. అధికారులు అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసిన తర్వాత వారిని స్వస్థలం తీసుకెళ్లనున్నారు. ఇమ్మిగ్రేషన్, వెరిఫికేషన్, బ్యాక్‌గ్రౌండ్ చెక్ వంటివి పూర్తి చేయనున్నారు. వారిని ఆయా రాష్ట్రాలకు తీసుకెళ్లడానికీ ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. ఫిబ్రవరి 5న తొలిసారిగా అమెరికా ఆర్మీ ఫ్లైట్ 104 మంది అక్రమ వలసదారులతో పంజాబ్ చేరుకుంది. రెండో విడతలో భాగంగా 116 మందిని శనివారం(ఫిబ్రవరి 15) మరో విమానం తీసుకువచ్చింది. వీరంతా అమెరికాలో అక్రమంగా నివాసముంటున్నట్టు గుర్తించి ఆ దేశం వెనక్కి పంపిస్తు్న్నది. అక్రమంగా నివాసముంటున్నవారు తమ దేశ పౌరులైతే వెనక్కి తీసుకోవడానికి సిద్ధమేనని ఇది వరకే భారత ప్రభుత్వం ప్రకటించింది.

రెండో బ్యాచ్‌‌లోనూ అవమానమే.. సంకెళ్లు, కాళ్లకు చైన్లు

తొలి బ్యాచ్ డిపోర్టేషన్‌లో అమెరికా అధికారులు కనీస మానవ విలువలు పాటించలేదని, నేరస్తుల్లా చేతులకు బేడీలు, కాళ్లు ఇనుప చైన్లు కట్టి ఫ్లైట్ ఎక్కించారని, అమృత్‌సర్‌లో ఫ్లైట్ దిగే వరకూ నిర్బంధించే ఉంచారని బాధితులు తెలిపారు. కనీసం టాయిలెట్ వెళ్లాలన్నా కంచె తొలగించలేదని, మహిళలు, పిల్లలు అనే తేడా లేకుండా నిర్బంధించారని ఆగ్రహించారు. సీటుపై నుంచి కనీసం లేవనివ్వలేదనీ వాపోయారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ రగడ సృష్టించింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రాగా కేంద్రం.. అమెరికా ప్రభుత్వం ముందు ఈ అంశాన్ని లేవనెత్తుతామని, ఈ మేరకు సంప్రదింపులూ మొదలుపెట్టామని చెప్పుకొచ్చింది. కానీ, పది రోజుల తర్వాత ఫిబ్రవరి 15న రెండో బ్యాచ్‌ డిపోర్టేషన్‌లో భాగంగా అమృత్‌సర్‌ చేరుకున్న భారత పౌరులూ(116 మంది) తమ చేతులు, కాళ్లకు సంకెళ్లు వేశారని చెప్పారు. ఈ సారి మహిళలకు బేడీలు వేయలేదని చెప్పారు. మోడీ అమెరికా పర్యటన తర్వాత వచ్చిన ఈ బ్యాచ్‌లోని భారతీయులతో అమెరికా దురుసు ప్రవర్తననే కొనసాగించింది. కాగా, ఆదివారం మూడో బ్యాచ్ డిపోర్టేషన్‌లో భాగంగా పౌరులు అమృత్‌సర్ వచ్చారు. తమను ఏజెంట్లు మోసం చేశారని, భూమి, ఇతర ఆస్తులు అమ్ముకుని డబ్బులు అప్పజెబితే వారు తమను నేరుగా అమెరికాకు తీసుకెళ్లకుండా డంకి రూట్‌లో తీసుకెళ్లారని పలువురు బాధితులు వాపోయారు.



Next Story

Most Viewed