రాజ్యాంగంలో 22 మీనియేచర్ ఇలస్ట్రేషన్స్ మిస్సింగ్

by Ajay kumar |
రాజ్యాంగంలో 22 మీనియేచర్ ఇలస్ట్రేషన్స్ మిస్సింగ్
X

- నంద్‌లాల్ బోస్‌కి చెందిన దృష్ట్యాంతాలను తొలగించారు

- రాజ్యసభలో బీజేపీ ఎంపీ రాధామోహన్ ఆరోపణ

- రాజ్యాంగ నిర్మాతలు సంతకం చేసినవే ఒరిజినల్ అన్న చైర్మన్ ధన్‌కర్

- ఇవన్నీ అనవసరమైన రాద్ధాంతాలన్న కాంగ్రెస్

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగంలో 22 మీనియేచర్ ఇలస్ట్రేషన్స్‌ కనపడటం లేదు. చిత్రకారుడు నంద్‌లాల్ బోస్ రూపొందించిన సూక్ష్మ దృష్ట్యాంతాలను (మీనియేచర్ ఇలస్ట్రేషన్స్) కొత్త కాపీల నుంచి తొలగించారని బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ మంగళవారం రాజ్యసభలో ఆరోపించారు. 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు అందులో ఉన్న కీలక భాగాలను తర్వాత కాలంలో తొలగించారని ఆయన ఆరోపించారు. భారత దేశానికి సంబంధించిన నాగరికత, సంస్కృతిని వర్ణిస్తూ రూపొందించిన దృష్ట్యాంతాలు కనపడటం లేదు. సింధూ నాగరికతతో పాటు మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు అలాగే రాముడు, బుద్దుడు, మహావీర్, సామ్రాట్ విక్రమాధిత్య, లక్ష్మీబాయి, శివాజీ మహారాజ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన దృష్ట్యాంతాలు ఇప్పుడు లేవని రాధామోహన్ దాస్ ఆరోపించారు. ఇప్పుడు ఏ విద్యార్థైనా లేదా పౌరుడైనా వెళ్లి కొత్త రాజ్యాంగాన్ని కొంటే.. రాజ్యాంగ నిర్మాతలు సంతకం చేసిన ఒరిజినల్ వెర్షన్ రావడం లేదని చెప్పారు. అయితే ఏ కారణంతో వీటిని తొలగించారో తనకు అవగాహన లేదని రాధా మోహన్ చెప్పుకొచ్చారు. రాజ్యాంగం నుంచి ఏ సవరణలు చేయాలన్నీ కొన్ని పద్దతులు ఉన్నాయి. ఒక ఫుల్ స్టాప్‌ను కామాను తొలగించాలన్నా చట్ట పరంగానే చేయాలని రాధా మోహన్ చెప్పారు. అయితే ఈ బొమ్మలను మాత్రం రాజ్యాంగ విరుద్దంగా తొలగించారని రాధా మోహన్ దాస్ ఆరోపించారు.

రాధామోహన్ దాస్ ఆరోపణలపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆయన అసంబద్దమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆందోళన చేపట్టాయి. అధికార, ప్రతిపక్షాల నినాదాలతో కాసేపు రాజ్యసభలో గందరగోళం నెలకొంది. దీంతో రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ కలుగజేసుకొని సభలో గందరగోళాన్ని సద్దుమణిగించడానికి ప్రయత్నించారు. 'ఈ విషయంలో నాకు ఎలాంటి అనుమానం లేదు. రాజ్యాంగ నిర్మాతలు సంతకాలు చేసిన దానిలో 22 సూక్ష్మ దృష్ట్యాంతాలు ఉంటాయి. అది మాత్రమే ప్రామాణికమైనది. పార్లమెంట్ ద్వారా సవరణ చేయబడితే తప్ప న్యాయ వ్యవస్థ కానీ, ఇతర సంస్థలు కానీ దాన్ని తొలగిస్తే అది ఆమోదయోగ్యం కాదు' అని జగ్‌దీప్ ధన్‌కర్ వ్యాఖ్యానించారు. పార్లమెంటు ద్వారా ఆమోదించబడిన దానిని మాత్రమే ప్రామాణికంగా భావించి, దాన్నే అందుబాటులో ఉంచాలి. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ధన్‌కర్ ఆదేశించారు.

కాగా.. ఈ విషయంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే స్పందించారు. ఇది అనవసరమైన రాద్దాంతమని కొట్టి పారేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ పరువుకు భంగం కలిగించేందుకే ఇలాంటి వివాదాన్ని సృష్టిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. అయితే ఇది చాలా ముఖ్యమైన విషయమని రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా చెప్పారు. రాజ్యాంగం ఒరిజినల్ వెర్షన్ చూపిస్తూ.. కొత్త వాటిలో ఇలస్ట్రేషన్స్ ముద్రించబడలేదని చెప్పారు. ప్రభుత్వం త్వరలోనే రాజ్యాంగంలో వాటన్నింటినీ ముద్రిస్తుందని చెప్పారు.



Next Story