జ్ఞానవాపి మసీదు వివాదంపై యూపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

by Harish |   ( Updated:2023-07-31 11:04:24.0  )
జ్ఞానవాపి మసీదు వివాదంపై యూపీ సీఎం సంచలన వ్యాఖ్యలు
X

లక్నో: ఉత్తరప్రదేశ్‌‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ మసీదు విషయంలో జరిగిన చారిత్రక తప్పిదానికి పరిష్కారాన్ని చూపాల్సిన బాధ్యత ముస్లింలపై ఉందన్నారు. జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వే చేయాలంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టులో మసీదు కమిటీ వేసిన అప్పీల్ పిటిషన్‌ పై విచారణ జరుగుతున్న తరుణంలో యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఈ అప్పీల్ పిటిషన్‌పై ఆగస్టు 3న తీర్పు వెలువడే అవకాశం ఉంది. "జ్ఞానవాపిని మసీదు అని పిలిస్తే.. అది వివాదంగా మారుతుంది. భగవంతుడు చూపు ఇచ్చిన వాళ్ళు ఆ మసీదులో ఉన్న త్రిశూలాన్ని చూడాలి.. అది అక్కడ ఎందుకు ఉందో ఆలోచించాలి. అక్కడే జ్యోతిర్లింగం, దేవతా మూర్తులు కూడా ఉన్నాయి. జ్ఞానవాపి గోడలు అరుస్తూ ఏదేదో మాట్లాడుతున్నాయి. చారిత్రక తప్పిదం జరిగింది. దీనికి పరిష్కారం చూపేలా ముస్లిం సమాజం నుంచి ప్రతిపాదన రావాలని నేను కోరుకుంటున్నాను" అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. "జ్ఞానవాపి మసీదులో ఏఎస్‌ఐ సర్వేను వ్యతిరేకిస్తూ అలహాబాద్ హైకోర్టులో ముస్లిం పక్షం వేసిన పిటిషన్‌పై త్వరలో తీర్పు వెలువడుతుంది. ఈ విషయం తెలిసినా సీఎం యోగి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదు" అని అన్నారు.

Also Read : జ్ఞానవాపి మసీదు కాదు.. జ్యోతిర్లింగం! UP CM సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story