Tv ads: పగటి పూట జంక్ ఫుడ్ యాడ్స్ నిషేధం.. వచ్చే ఏడాది నుంచి బ్రిటన్‌లో అమలు !

by vinod kumar |
Tv ads: పగటి పూట జంక్ ఫుడ్ యాడ్స్ నిషేధం.. వచ్చే ఏడాది నుంచి బ్రిటన్‌లో అమలు !
X

దిశ, నేషనల్ బ్యూరో: జంక్ ఫుడ్‌తో పిల్లలకు ఊబకాయం పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం (Uk govt) కీలక నిర్ణయం తీసుకుంది. టీవీల్లో పగటి పూట జంక్ ఫుడ్స్‌కు సంబంధించిన యాడ్స్‌ (Ads)పై నిషేధం విధించనున్నట్టు తెలుస్తోంది. బర్గర్లు, మఫిన్‌, గ్రాన్యూలా, జంక్ ఫుడ్‌గా గుర్తించబడిన ఇతర పదార్థాలపై బ్యాన్ విధించనుంది. వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. కొత్త విధానం అమల్లోకి వచ్చిన వెంటనే ఈ ఆహార పదార్థాలకు సంబంధించిన ప్రకటనలు రాత్రి 9 గంటల తర్వాత మాత్రమే కనిపిస్తాయి. ఈ చర్యల ద్వారా ఏటా దాదాపు 20,000 మంది చిన్నారుల ఊబకాయం కేసులను నియంత్రించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జంక్ ఫుడ్ వల్ల పిల్లల ఊబకాయం పెరుగుతుందని నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

కాగా, బ్రిటన్ ఎన్‌హెచ్ఎస్ నివేదిక ప్రకారం.. దేశంలోని పిల్లల్లో ఊబకాయం పెద్ద ఎత్తున పెరుగుతోంది. నాలుగేళ్లలోపు ఉన్న ప్రతి పది మంది పిల్లల్లో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. అలాగే ఐదేళ్ల వయస్సు గల వారిలో 23.7శాతం మంది అధిక చక్కెర వినియోగం కారణంగా దంత క్షయంతో ఇబ్బంది పడుతున్నారు. తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య వస్తోందని ఎన్‌హెచ్ఎస్ తెలిపింది. ఊబకాయం ప్రభావంతో పిల్లలు జీవితాంతం ఇబ్బందిపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో పిల్లలను టార్గెట్ చేస్తూ వెలువడుతున్న ఈ జంక్ ఫుడ్ ప్రకటనలను నిషేధించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed