విభేదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం: ఇండియా కూటమి సంక్షోభంపై మల్లికార్జున్ ఖర్గే

by samatah |
విభేదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం: ఇండియా కూటమి సంక్షోభంపై మల్లికార్జున్ ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఇండియా’ కూటమిలో నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కూటమి నుంచి జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) వైదొలగడం పట్ల తనకు సమాచారం లేదని స్పష్టం చేశారు. భాగస్వామ్యపార్టీలన్నింటినీ ఏకం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. శనివారం ఆయన కర్ణాటక రాజధాని బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘నితీశ్ మనసులో ఏముందో నాకు తెలియదు. రేపు ఢిల్లీకి వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకుంటా. నితీశ్‌కు ఇప్పటికే లేఖ రాశా, ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నా’ అని తెలిపారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ, సీపీఎం నేత సీతారాం ఏచూరితోనూ ఇప్పటికే మాట్లాడానని..అందరినీ ఐక్యం చేస్తామన్నారు. అందరూ కలిసి ఉన్నప్పుడే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోరాడగలమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుకునే వారు తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.

నితీశ్ కుమార్ నివాసంలో జేడీయూ సమావేశం

బిహార్‌లో రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో రాజధాని పాట్నాలో నితీశ్ కుమార్‌తో జేడీయూ సీనియర్ నేతల సమావేశం ప్రారంభమైంది. బిహార్ శాసనమండలి చైర్మన్ దేవేష్ చంద్ర ఠాకూర్, సీనియర్ నేత లలన్ సింగ్ తదితరులు నితీశ్ నివాసానికి చేరుకున్నారు. అలాగే రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎమ్మెల్య్యేలు, కీలక నేతలు సైతం ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఇంట్లో భేటీ అయ్యారు.

Advertisement

Next Story