Trump: గాజాను స్వాధీనం చేసుకుంటాం.. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన

by vinod kumar |
Trump: గాజాను స్వాధీనం చేసుకుంటాం.. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి యూఎస్ కృషి చేస్తుందని నొక్కి చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin nethanyahu) తో ఆయన భేటీ అయ్యారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం సహా పలు కీలక అంశాలపై డిస్కస్ చేశారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘గాజా స్ట్రిప్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. ఆ ప్రదేశంలో ఉన్న ప్రమాదకరమైన పేలని బాంబులు, ఇతర ఆయుధాలన్నింటినీ నిర్వీర్యం చేసే బాధ్యత తీసుకుంటాం. ధ్వంసమైన భవనాలను శుభ్రం చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం’ అని తెలిపారు. మధ్యప్రాచ్యంలో గత నాలుగేళ్లుగా ఎవరూ దృష్టి సారించలేదని విమర్శించారు.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. గాజా స్ట్రిప్‌లో ఏడాదిన్నర పాటు జరిగిన పోరాటం తర్వాత ఇజ్రాయెల్ గతంలో కంటే బలంగా ఉందని నొక్కి చెప్పారు. గాజాలో తమకు బందీల విడుదల, హమాస్‌ను నిర్మూలించడం, శాంతి పునరుద్ధరణ వంటి మూడు లక్ష్యాలున్నాయని వెల్లడించారు. వీటన్నింటినీ సాధిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో మళ్లీ ఇజ్రాయెల్‌కు ముప్పు కలుగకుండా చూస్తామన్నారు. ఇజ్రాయెల్ ఇప్పుడున్నంత బలంగా ఎప్పుడూ లేదన్నారు. కాగా, ట్రంప్ రెండో సారి అధ్యక్షుడిగా సమావేశమైన తర్వాత విదేశీ నాయకుడితో భేటీ అవడం ఇదే తొలిసారి.

ట్రంప్ ప్రకటనపై హమాస్ స్పందించింది. ఇలాంటి ప్రకటనలు ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని తెలిపింది. గాజాలో తమ ప్రణాళికలను అమలు చేయడానికి అనుమతించబోమని పేర్కొంది. అలాగే ఈజిప్ట్, జోర్డాన్, చైనా, రష్యా సహా అమెరికా మిత్రదేశాలు సైతం ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. ఈ తరహా కామెంట్స్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ చర్చలను దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపాయి.

Next Story

Most Viewed