Supreme Court: ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఆందోళన

by Shamantha N |
Supreme Court: ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఆందోళన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలే ఎస్సీ/ఎస్టీ వర్గానికి చెందిన ఇద్దరు ఐఐటీ-ఢిల్లీ విద్యార్థుల ఆత్మహత్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. దర్యాప్తు చేపట్టడానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హోదా అధికారిని నియమించాలని జస్టిస్ జేపీ పార్థీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ లతో కూడిన ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టాలని సూచించింది. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు, ఆత్మహత్యలను నివారించేందుకు ‘నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌’ను ఏర్పాటు చేయాలని న్యాయస్థానం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విభాగానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ నాయకత్వం వహిస్తారని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని విద్యాశాఖ ఉన్నతాధికారులను ఇందులో భాగం చేయాలని అధికారులను ఆదేశించింది.

ఎవరికీ చెప్పుకోని పరిస్థితుల్లో ఆత్మహత్యలు

అంతేకాకుండా, విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల్లో తీవ్రమవుతున్న ఒత్తిడి, మానసిక సమస్యలను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కోర్టు పేర్కొంది. వాటికి దారితీసే అంతర్గత కారణాలను నివారించడానికి సరైన మార్గదర్శకాలను రూపొందించాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడింది. విద్యార్థుల భద్రత, శ్రేయస్సు కోసం చర్యలు తీసుకునే బాధ్యత ప్రతి విద్యాసంస్థపై ఉందంది. క్యాంపస్‌ పరిధిలో ఆత్మహత్య లాంటి దురదృష్ట ఘటన జరిగినప్పుడు యాజమాన్యం వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చి.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించింది. అది పోలీసుల ప్రాథమిక విధి అని వెల్లడించింది. దీనికి పోలీసులు కూడా సరైన సమయంలో స్పందించి వేగంగా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. విద్యార్థులు మానసిక కుంగుబాటు, ఒత్తిడికి లోనవ్వకుండా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం, సామాజిక సంస్థలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మొదలైన చర్యలు చేపట్టాలని సూచించింది. కాగా.. జూలై 2023లో బీటెక్ విద్యార్థి ఆయుష్ అష్నా తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని విగతజీవిగా చనిపోయాడు. సెప్టెంబర్ 1, 2023న యూపీలోని బందా జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి అనిల్ కుమార్ (21) ఇన్‌స్టిట్యూట్‌లోని తన హాస్టల్ గదిలో చనిపోయి కనిపించాడు.అనిల్ కుమార్ 2019లో ఐఐటీలో చేరారడు. అయితే, ఈ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. వారి మరణాలు ఆత్మహత్యలు కాదని, కుట్ర ఫలితంగా జరిగిన హత్యలని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఐఐటీ ప్రొఫెసర్స్, సిబ్బందిపై కులవివక్ష ఆరోపణలు చేశారు. కాగా.. ఈ అంశంపైనే సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.

Next Story

Most Viewed