Niti Aayog : నేటి ‘నీతి ఆయోగ్’ సమావేశం.. టాప్ పాయింట్స్ ఇవీ

by Hajipasha |
Niti Aayog : నేటి ‘నీతి ఆయోగ్’ సమావేశం.. టాప్ పాయింట్స్ ఇవీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘వికసిత్ భారత్ 2047’ ప్రతి భారతీయుడి ఆశయమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. మనదేశం ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో రాష్ట్రాలే క్రియాశీలక పాత్రను పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు చేరువగా ఉండే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని, అందుకే అవి మరింత చొరవ చూపించాలని ఆయన కోరారు. ఉమ్మడి కృషితో ఈ కలను నెరవేర్చుకోవడం సులభమని , వికసిత రాష్ట్రాలతోనే వికసిత భారత్ సాధ్యమన్నారు. శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ 9వ పాలక మండలి సమావేశం జరిగింది. ఈసందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్ సరైన మార్గంలోనే ముందుకు సాగుతోందన్నారు. కరోనా లాంటి సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొన్నామని, దానివల్ల దేశ ప్రజల్లో ఎంతో విశ్వాసం పెరిగిందని చెప్పారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యధిక వర్క్‌ఫోర్స్ ఉన్న దేశం భారత్ మాత్రమేనని ప్రధాని మోడీ అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని యువతలో నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. యువతలో నైపుణ్యాల పెంపుతో పాటు పరిశోధన, ఆవిష్కరణలు, ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని ప్రధాని కోరారు. ముద్రా లోన్స్, పీఎం విశ్వకర్మ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ), నేర చట్టాల వ్యవస్థలలో సంస్కరణలు చేయడం ద్వారా భారతీయ సమాజం, ఆర్థిక వ్యవస్థలో క్రమానుగుణ మార్పును సాధిస్తున్నట్లు మోడీ తెలిపారు.

మైక్ కట్ చేశారంటూ మమత వాకౌట్

ఇండియా కూటమి పార్టీలు పాలిస్తున్న తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు. విపక్ష పాలిత రాష్ట్రాలను కేంద్రబడ్జెట్‌లో విస్మరించినందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. అయితే నీతి ఆయోగ్ సమావేశానికి ఇండియా కూటమిలో భాగంగా ఉన్న టీఎంసీ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. అయితే సమావేశం మధ్యలోనే ఆమె వాకౌట్ చేశారు. తాను ప్రసంగిస్తుండగా మైక్ కట్ చేసినందు వల్లే వాకౌట్ చేశానని దీదీ తెలిపారు. “ఈ సమావేశంలో చంద్రబాబు 20 నిమిషాలు మాట్లాడారు. ఇతర నేతలు 15 నిమిషాలు మాట్లాడారు. విపక్షాల నుంచి సమావేశానికి హాజరైంది నేను ఒక్కదాన్నే.. కనీసం నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. కేంద్రం వివక్షతో వ్యవహరిస్తోంది. కేంద్ర బడ్జెట్ కూడా రాజకీయంగా ఉంది” అని మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘‘నీతి అయోగ్ సమావేశంలో తన మైక్‌ను కట్ చేయడం అంటే.. బెంగాల్ ప్రజలను మాత్రమే కాదు అన్ని ప్రాంతీయ పార్టీలను అవమానించడమే’’ అని దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్‌ను రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ తిరిగి తేవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వంపై తమిళనాడు సీఎం స్టాలిన్ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు గుప్పించారు. మమతా మైక్ కట్ చేయడం కో ఆపరేటివ్ ఫెడరలిజమా అని ఆయన ప్రశ్నించారు. కో ఆపరేటివ్ ఫెడరలిజం మనుగడ సాధించాలంటే చర్చలు అవసరమన్నారు. ముఖ్యమంత్రి పట్ల వ్యవహిరించే తీరు ఇదేనా? అని అడిగారు. ప్రతిపక్షాలు కూడా ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని గుర్తించాలని హితవు పలికారు. ప్రతిపక్షాలను శత్రువులుగా పరిగణించకూడదని కేంద్రంలోని బీజేపీ అర్థం చేసుకోవాలన్నారు.

ఆర్థికమంత్రి, నీతి ఆయోగ్ సీఈవో క్లారిటీ

మమతా బెనర్జీ మైక్ కట్ చేశారనే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం క్లారిటీ ఇచ్చారు. ‘‘సమావేశంలో మాట్లాడటానికి ప్రతీ సీఎంకు 7 నిమిషాల టైం కేటాయించాం. మమతా బెనర్జీ కూడా అంతసేపు మాట్లాడారు. అయితే ఆమె అంతకు మించి మాట్లాడే సమయాన్ని ఆశించారు. దీంతో ఆమె మైక్‌ను ఆఫ్ చేయాల్సి వచ్చింది’’ అని నిర్మలా సీతారామని స్పష్టం చేశారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం ఇచ్చినందు వల్లే బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మాట్లాడే అవకాశం చివర్లో వచ్చిందని నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఈమేరకు వివరాలతో ఓ ప్రకటన విడుదల చేసింది.

బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ గైర్హాజరు

ఎన్డీఏ కూటమిలోని కీలక భాగస్వామ్యపక్షమైన జేడీయూ నుంచి బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ నీతిఆయోగ్‌ సమావేశానికి రాలేదు. అనారోగ్యకారణాల వల్లే నితీశ్‌ రాలేదని జేడీయూ ఓ ప్రకటనలో తెలిపింది. బిహార్ తరఫున ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా హాజరయ్యారు. నీతి ఆయోగ్ సమావేశానికి నితీశ్ హాజరుకాకపోవడం ఇదే మొదటిసారి కాదని జేడీయూ ప్రతినిధి నీరజ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన నలుగురు సభ్యులు నీతి ఆయోగ్‌లో సభ్యులుగా ఉన్నారని, వారు హాజరయ్యారని చెప్పారు.



Next Story

Most Viewed