- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘పెద్దల’’ సభల్లో నో రిజర్వేషన్.. సాధికారత అంటూనే మహిళలపై కొనసాగుతోన్న వివక్ష..!
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు కేవలం లోక్‌సభ, అసెంబ్లీలకు మాత్రమే వర్తించనున్నది. ప్రజలు నేరుగా ఎన్నుకునే చట్టసభలకు మాత్రమే పరిమితం కానున్నది. రాజ్యసభ, శాసనమండలిలో మహిళలకు రిజర్వేషన్ అవకాశాల్లేవ్. పార్టీల అధినేతలు ఎవరికి అవకాశం ఇస్తే వారికే పదవులు దక్కనున్నాయి.
రాజ్యసభ, శాసనమండలిని పార్టీల అధినేతలు, అసెంబ్లీ, పార్లమెంటు ‘పెద్దల సభ’లుగా అభివర్ణిస్తున్నప్పటికీ మహిళా రిజర్వేషన్ నుంచి వాటిని కేంద్ర ప్రభుత్వం మినహాయించింది. చట్టాలు చేయడంలో ఈ రెండు సభలకూ లోక్‌సభ, శాసనసభలతో సమాన ప్రాధాన్యత ఉన్నా మహిళా రిజర్వేషన్ విషయంలో మాత్రం మొండి చేయే ఎదురవుతున్నది.
వాస్తవానికి మహిళా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఈ బిల్లుకు మూడు దశాబ్దాల క్రితమే ‘చట్టసభల్లో మహిలా రిజర్వేషన్’ అని నామకరణం జరిగింది. కానీ రాజ్యసభ, శాసనమండలి కూడా చట్టసభలే అయినా ప్రజలు నేరుగా ఎన్నుకునే విధానం లేకపోవడంతో మహిళా రిజర్వేషన్ నుంచి వాటిని ప్రభుత్వం మినహాయించింది.
మహిళా రిజర్వేషన్ కోసం పట్టుబడుతున్న పార్టీల నేతలు సైతం ఈ రెండు సభలకూ అదే వెసులుబాటు ఉండాలని డిమాండ్ చేయకపోవడం గమనార్హం. పార్లమెంటు, అసెంబ్లీల్లో ప్రభుత్వాలు ప్రవేశపెట్టే కీలకమైన బిల్లులు సాకారం కావాలంటే ‘పెద్దల సభ’లుగా పిల్చుకునే రాజ్యసభ, శాసనమండలిలో సైతం ఆమోదం పొందడం తప్పనిసరి.
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయాన్నే చూసుకుంటే యూపీఏ హయాంలో 2008లో రాజ్యసభలోకి వచ్చిన తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయనానికి వెళ్ళింది. నివేదికలో పలు సిఫారసుల అనంతరం రెండేండ్లకు ఈ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించింది. ఇప్పుడు లోక్‌సభలో మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినా తిరిగి రాజ్యసభలో ఆమోదం పొందడం అనివార్యం.
కీలక బిల్లులు చట్టరూపం దాల్చాలంటే పెద్దల సభల్లో ఆమోదం తప్పనిసరి అని తెలిసినా మహిళలకు రిజర్వేషన్ కల్పించకపోవడం ఒక సెక్షన్ ఎంపీలలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాలు వాటిల్లో మహిళా రిజర్వేషన్ విషయాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదనేది సమాధానం లేని ప్రశ్నగానే ఉండిపోయింది.
చట్టం ద్వారా ‘తప్పనిసరి’ అనే నిబంధన ఉంటే మాత్రమే రాజకీయ పార్టీల అధినేతలు పాటించడం ఒక రొటీన్ ప్రాక్టీసుగా మారింది. మూడు దశాబ్దాలుగా మహిళలకు సాధికారికత, చట్టసభల్లో వారికి ప్రాతినిధ్యం, రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్లను తెరమీదకు తెస్తున్నా, చట్టరూపంగా అది ‘తప్పనిసరి’ కాకపోవడంతో అమలుకు నోచుకోవడంలేదు.
ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కేవలం లోక్‌సభ, అసెంబ్లీలకు మాత్రమే పరిమితం అవుతున్నందున రాజ్యసభ, శాసనమండలిలో వారికి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. రిజర్వేషన్ షరతు లేకపోవడంతో సహజంగా ఎక్కువ అవకాశాలు పురుషులకు లభిస్తాయి. లోక్‌సభ, అసెంబ్లీలలో 33% మంది మహిళా సభ్యులు కనిపించినా పెద్దల సభల్లో మాత్రం పురుష సభ్యులే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తారు.
ఒకవైపు మహిళలకు సమానావకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా.. పెద్దల సభ విషయంలో అదే ఫార్ములాను అమలు చేయడంపై ప్రభుత్వాల మీద ఒత్తిడి లేకపోవడం గమనార్హం. పార్టీకి తప్పనిసరి అవసరం అని భావించే కీలక నేతలను మహిళా రిజర్వేషన్ కారణంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశాలు కల్పించలేకపోవడంతో ఇకపైన వారిని రాజ్యసభ, శాసనమండలికి పంపడానికి ప్రత్యామ్నాయంగా మారుతుంది.
ఇప్పటికే ‘పెద్దల సభ’లుగా చెప్పుకునే ఈ రెండింటినీ ‘ఆరో వేలు’గా భావించే అభిప్రాయాలున్నాయి. ఆ రెండు సభల్లో మహిళలకు స్థానం కల్పించడంపై షరతు లేకపోవడంతో ఎక్కువ మంది పురుషులతోనే నిండిపోయే అవకాశమున్నది. చట్టసభలే అయినా ఈ రెండింటిపై మాత్రం కనిపించని లింగ వివక్ష నెలకొనే ఛాన్సులున్నాయి.