Kangana Ranaut: కంగనా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు.. బీజేపీ సంచలన ప్రకటన

by Ramesh Goud |   ( Updated:2024-08-26 12:34:40.0  )
Kangana Ranaut: కంగనా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు.. బీజేపీ సంచలన ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైతుల నిరసనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఆమె వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని బీజేపీ ప్రకటన విడుదల చేశింది. ఇందులో రైతు ఉద్యమంపై కంగనా రనౌత్ ఇచ్చిన ప్రకటన పార్టీ అభిప్రాయం కాదని, ఆమె ప్రకటనతో భారతీయ జనతా పార్టీ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. అంతేగాక ఎంపీ కంగనా రనౌత్ కు పార్టీ విధాన సమస్యలపై ప్రకటనలు చేయడానికి అనుమతి లేదా అధికారం లేదని స్పష్టం చేశింది. ఇక భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తరుఫున కంగనా రనౌత్ అలాంటి వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశింది. బీజేపీ సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ తో పాటు సామాజిక సామరస్యం సూత్రాలను అనుసరిస్తుందని తెలిపింది.

కాగా బీజేపీ ఎంపీగా ఉన్న సినీ నటి కంగనా రనౌత్ రైతుల నిరసనల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్స్ లో వీడియో పోస్ట్ చేశారు. ఇందులో రైతుల నిరసనలను కట్టడి చేసేందుకు మోడీ ప్రభుత్వం చర్యలు చేపట్టకుంటే బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని అన్నారు. మూడు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, ఎన్నో లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని, సాగు చట్టాలు వెనక్కి తీసుకున్నా నిరసనలు కొనసాగేలా కొందరు వ్యక్తులు ప్రోత్సహించాని, దేశం కుక్కల పాలైనా వారికేం పట్టదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కంగనా రనౌత్ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే తీవ్ర దుమారం రేపాయి. దీనిపై కొందరు బీజేపీ నేతలు స్పందిస్తూ.. ఇలాంటి వ్యాఖ్యలు మంచిది కాదని, కంగనా రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ఈ నేపథ్యంలోనే కంగనా వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ బీజేపీ ప్రకటన విడుదల చేశింది.

Advertisement

Next Story