పాట్నా గంగా నదిలో పడవ బోల్తా.. 6 గురు గల్లంతు

by Harish |
పాట్నా గంగా నదిలో పడవ బోల్తా.. 6 గురు గల్లంతు
X

దిశ, నేషనల్ బ్యూరో: బీహార్‌ రాజధాని పాట్నాలోని గంగా నదిలో పడవ బోల్తా పడగా ఆరుగురు గల్లంతైనట్లు సమాచారం. గంగా దసరా సందర్భంగా ఆదివారం ఉదయం ఉమానాథ్ ఘాట్ వద్ద భారీగా భక్తులు చేరుకున్నారు. ఈ క్రమంలో నదికి ఒకవైపు నుంచి మరోవైపుకు భక్తులను పడవలో తీసుకెళ్తున్నారు. అదే విధంగా ఉమానాథ్ ఘాట్ నుండి డయారాకు 17 మందితో వెళ్తున్న పడవ అకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో పడవలోంచి అందరు నీళ్లలో పడ్డారు. అయితే వీరిలో 11 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. కానీ మిగిలిన 6 మంది మాత్రం గల్లంతయ్యారు. ఈ ఘటనతో ఘాట్ ప్రాంతంలో తీవ్ర అలజడి నెలకొంది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఉమానాథ్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. మునిగిపోయిన వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ వారు గల్లంతైన విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని బోరున విలపిస్తున్నారు. ఇటీవల కాలంలో పడవ బోల్తా ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. గత నెల ప్రారంభంలో బీహార్‌లోని మహావీర్ తోలా గ్రామ సమీపంలో గంగా నదిలో పడవ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.

Advertisement

Next Story

Most Viewed