గడ్కరీ పేరు లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది: ఉద్ధవ్ థాక్రే

by samatah |
గడ్కరీ పేరు లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది: ఉద్ధవ్ థాక్రే
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఎన్నికలకు గాను బీజేపీ మొదటి జాబితాలో రిలీజ్ చేసిన 195 మంది అభ్యర్థుల లిస్టులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే అన్నారు. బాల్‌థాక్రే ప్రారంభించిన ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టును పూర్తి చేయడంలో గడ్కరీ ఎంతో సహకరించారని కొనియాడారు. ప్రస్తుతం ప్రతిపక్షాలను కూల్చే రాజకీయాలు జరుగుతున్నాయని, అవి సరైన పద్దతి కాదని తెలిపారు. అవినీతికి పాల్పడిన నేతలను బీజేపీలో చేర్చుకోవడం అనవాయితీగా మారిందని విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత కృపాకర్ సింగ్ బీజేపీలో చేరారని, గతంలో కృపాకర్ అవినీతి పరుడని దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను ఆయన మర్చిపోయారా అని ప్రశ్నించారు. కాగా, ఇటీవల బీజేపీలో చేరిన కృపాకర్‌ను ఉత్తరప్రదేశ్‌లోని జాన్ పూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఈ క్రమంలోనే ఉద్ధవ్ పై వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మహారాష్ట్రలోని 48 స్థానాలకు బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే నితిన్ గడ్కరీ ప్రస్తుతం నాగ్‌పూర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Advertisement

Next Story