సందేశ్‌‌ఖాలీలో మరోసారి ఉద్రిక్తత: బీజేపీ చీఫ్‌ను అడ్డుకున్న పోలీసులు

by samatah |
సందేశ్‌‌ఖాలీలో మరోసారి ఉద్రిక్తత: బీజేపీ చీఫ్‌ను అడ్డుకున్న పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌ నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్ ఖాలీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమస్యాత్మక ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్తుండగా బీజేపీ రాష్ట్ర చీఫ్ సువేంధు అధికారిని పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించినందున వెళ్లడం కుదరదని పోలీసులు స్పష్టం చేశారు. గతంలోనూ రెండు సార్లు సువేంధును ఆక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో సువేంధు కోల్‌కతా హైకోర్టులో ఫిర్యాదు చేయగా..కోర్టు కొన్ని షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడొద్దని సూచించింది. అయినప్పటికీ పోలీసులు బీజేపీ నేతలను అడ్డకుకోవడం గమనార్హం. కాగా, సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్, అతని మద్దతుదారులు భూకబ్జాలు చేశారని, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అప్పటి నుంచి షాజహాన్ పరారీలోనే ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

న్యాయవ్యవస్థను అవమానిస్తున్నారు: సువేంధు

సందేశ్ ఖాలీని సందర్శించకుంగా తనను పోలీసులు అడ్డుకోవడంపై సువేంధు అధికారి స్పందించారు. కోర్టు అనుమతి ఉన్నప్పటికీ అడ్డుకోవడం సరైంది కాదని, అది న్యాయవ్యవస్థను అవమానించడమేనని మండిపడ్డారు.పోలీసులకు కొంత సమయం ఇచ్చానని అయినప్పటికీ అనుమతించకపోతే మళ్లి కోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు. మహిళల భద్రతే బీజేపీకి ముఖ్యమని ఇందులో రాజకీయ ఉద్దేశం ఏమీ లేదని స్పష్టం చేశారు. కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలతో కలిసి మాత్రమే సమస్యాత్మక ప్రాంతానికి వెళ్లనున్నట్టు చెప్పారు. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సందేశ్ ఖాలీని సందర్శించింది. బాధితులతో మాట్లాడిన అనంతరం..ఆమె మాట్లాడుతూ..పరిస్థితులు భయానకంగా ఉన్నాయని, పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర డీజీపీతోనూ రేఖా శర్మ భేటీ కానున్నారు.

Advertisement

Next Story

Most Viewed