Tarrifs: సుంకాల తగ్గింపుపై ఎలాంటి హామీ ఇవ్వలేదు.. ట్రంప్ ప్రకటనపై భారత్ క్లారిటీ

by vinod kumar |
Tarrifs: సుంకాల తగ్గింపుపై ఎలాంటి హామీ ఇవ్వలేదు.. ట్రంప్ ప్రకటనపై భారత్ క్లారిటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు భారత్ ఒప్పుకుందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా భారత్ స్పందించింది. టారిఫ్స్ తగ్గించేందుకు అమెరికాకు ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలిపింది. దిగుమతి సుంకాలను తగ్గించడానికి కట్టుబడి లేమని పేర్కొంది. ఈ అంశంపై యూఎస్‌కు ఎటువంటి హామీలు ఇవ్వలేదని పార్లమెంటరీ ప్యానెల్‌కు కేంద్రం తెలిపింది. ‘భారత్, అమెరికా పరస్పరం ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై పనిచేస్తున్నాయి. తక్షణ సుంకాల సర్దుబాట్ల కంటే దీర్ఘకాలిక సహకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. కానీ సుంకాల తగ్గింపుపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. ట్రంప్ పదే పదే లేవనెత్తుతున్న ఈ సమస్యను పరిష్కరించడానికి సెప్టెంబర్ వరకు సమయం అడిగాం. ఈ విషయంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి’ అని విదేశీ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరైన వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్త్వాల్ (Sunil barthwal) తెలిపారు.

కాగా, భారతదేశం అమెరికాపై సుంకాలను గణనీయంగా తగ్గించడానికి అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ ప్రకటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే భారత్ స్పందించింది. అంతకుముందు అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ.. అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. రెండు దేశాలు ప్రత్యేక ద్వైపాక్షిక సంబంధాన్ని పంచుకుంటున్నాయని కాబట్టి భారత్ తన వైఖరిని పునఃపరిశీలించుకోవాలని కోరారు.

Next Story

Most Viewed