ఇండియా కూటమి నేతలకు లేఖ రాసిన స్వాతి మలివాల్

by Harish |
ఇండియా కూటమి నేతలకు లేఖ రాసిన స్వాతి మలివాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దాడి గురించి, తనకు జరిగిన అన్యాయం గురించి ఇండియా కూటమి నేతలతో చర్చించడానికి తగిన సమయం ఇవ్వాలని స్వాతి మలివాల్ మంగళవారం కూటమి నేతలకు లేఖ రాశారు. ఇండియా కూటమి అగ్రనేతలైన ఎన్సీపీ-ఎస్పీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కు ఆమె లేఖ రాశారు.

మే 13న ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసంలో ఆయన పీఏ తనపై దాడికి పాల్పడ్డారని మలివాల్ లేఖలో పేర్కొన్నారు. ఈ సంఘటన తర్వాత, నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. దీనిలో విచారం ఏమిటంటే, నా స్వంత పార్టీ నాయకులు, నాకు మద్దతుగా నిలవాల్సిన సమయంలో నా క్యారెక్టర్‌పై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. 9 ఏళ్లలో మహిళా కమిషన్‌లో 1.7 లక్షల కేసులు విన్నాను, ఎవరికీ భయపడకుండా, ఎవరికీ తలవంచకుండా మహిళా కమిషన్‌ను ఉన్నత స్థానంలో నిలబెట్టాను, కానీ ముఖ్యమంత్రి ఇంట్లో నన్ను దారుణంగా కొట్టారు.

ఒక బాధితురాలుగా సాయం చేయకపోగా నాపైనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. నా ప్రతిష్ట, పాత్ర, విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ఆప్ నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. ఇలా నాపై అబద్ధాలు ప్రచారం చేయడం వల్ల, నాకు అనేకసార్లు అత్యాచారం, హత్య బెదిరింపులు వచ్చాయని ఆమె తన లేఖలో పేర్కొంది. బాధితురాలిగా నేను ఎదుర్కొన్న క్రూరమైన అవమానాలు, దాడుల గురించి మీతో చర్చించడానికి నాకు సమయం ఇవ్వాలని, తిరిగి స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు మలివాల్ లేఖలో రాశారు. ఈ విషయాన్ని ఆమె తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed