Prashant Kishore: బిహార్ లో ప్రశాంత్ కిషోర్ పై కేసు నమోదు

by Shamantha N |   ( Updated:2024-12-30 14:54:30.0  )
Prashant Kishore: బిహార్ లో ప్రశాంత్ కిషోర్ పై కేసు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌(Bihar)లో విద్యార్థుల నిరసన ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపిన ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్(Prashant Kishore)పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలానే పీకే పార్టీ కార్యకర్తలు, కోచింగ్ సెంటర్ల యజమానులు సహా 700 మంది గుర్తుతెలియని వ్యక్తులపై కేసునమోదు చేశారు. అనధికారికంగా సమూహంగా మారి, విద్యార్థులను ప్రేరేపించి, శాంతిభద్రతల సమస్యను సృష్టించారని పోలీసులు చెప్పుకొచ్చారు. పోలీసుల అనుమతి లేకుండానే జన్ సూరాజ్ పార్టీ సీఎం ఇంటి ముట్టడికి యత్నించారని ఆరోపించారు. పాట్నాలోని గాంధీ మైదాన్ సమీపంలో మార్చ్ నిర్వహించారని.. అది హింసాత్మకంగా మారిందని వెల్లడించారు. పోలీసులతో ఘర్షణకు దిగారని పేర్కొన్నారు. పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ.. నిరసనకరులు అధికారుల మార్గదర్శకాలను ఉల్లంఘించి.. శాంతిభద్రతలకు అంతరాయం కల్గించారని పోలీసులు తెలిపారు.

పాట్నాలో ఉద్రిక్తలు

బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (BPSC) ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆదివారం వేలాదిమంది అభ్యర్థులు పాట్నాలోని గాంధీ మైదాన్‌ వద్ద నిరసనకు దిగారు. జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ విద్యార్థులకు పూర్తి మద్దతును ప్రకటించారు. ముఖ్యమంత్రి నివాసం వైపు ర్యాలీగా బయల్దేరేందుకు విద్యార్థులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బారికేడ్ల పైనుంచి దూకుతున్న ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లు వాడారు. డిసెంబరు 13న నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్‌ కాంపిటేటివ్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గత పది రోజులుగా నిరుద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పరీక్షను రద్దు చేసి.. కొత్తగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో విద్యార్థులు తమ ఆందోళనలను ఉద్ధృతం చేశారు. ‘జన్‌ సురాజ్‌’ నేత ప్రశాంత్‌ కిశోర్‌తోపాటు పలువురు విద్యార్థులపై కేసులు నమోదు చేసిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు.


Read More..

Prashant Kishor: జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా.. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed