ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను అవమానిస్తారా?: ప్రధాని మోడీపై స్టాలిన్ ఆగ్రహం

by S Gopi |
ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను అవమానిస్తారా?: ప్రధాని మోడీపై స్టాలిన్ ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని జగన్నాథుని ఆలయంలోని రత్న భాండాగారం తాళాలు తమిళనాడుకు వెళ్లాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం తమిళనాడుకు వచ్చి ఇక్కడి ప్రజలను పొగిడిన మోడీ, ఇప్పుడు ఒడిశాకు వెళ్లి తమిళ ప్రజలను కించపరుస్తారా? అని ప్రశ్నించారు. ఆలయంలోని నిధిని దొంగలించారని తమిళ ప్రజలను ఎలా అవమానిస్తారు. ఒక దేశానికి నాయకుడంటే అన్ని రాష్ట్రాల ప్రజల మధ్య సోదరభావాన్ని పెంచేందుకు ప్రయత్నించాలి. ప్రధాని మోడీ వ్యాఖ్యలు జగన్నాథుడితో పాటు ఒడిశా రాష్ట్రంతో సత్సంబంధాలు, స్నేహం ఉన్న తమిళ ప్రజలను కూడా కించపరిచే విధంగా ఉన్నాయని, ప్రధాని ద్వంద వైఖరిని అనుసరిస్తున్నారని విమర్శించారు. కేవలం ఓట్లు దండుకోవడానికి ప్రధాని మోడీ ఆరోపణలు చేయడం విచారకరమన్నారు. ప్రధాని ప్రచార వైఖరిని ప్రజలు ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటున్నారని స్టాలిన్ తెలిపారు. మోడీ తన ద్వేషపూరిత ప్రసంగాలతో ప్రజల మధ్య శత్రుత్వం, రాష్ట్రాల మధ్య విద్వేషాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed