రాహుల్ గాంధీ ముగింపు సభకు మంచు ఎఫెక్ట్!

by Nagaya |   ( Updated:2023-01-30 08:45:05.0  )
రాహుల్ గాంధీ ముగింపు సభకు మంచు ఎఫెక్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు సభకు ప్రతికూల వాతావరణం ఆటంకంగా మారింది. శ్రీనగర్‌లో సోమవారం భారీగా మంచు కురుస్తోంది. దీంతో యాత్ర ముగింపు సందర్భంగా షేర్-ఐ-కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన మెగా ర్యాలీపై ప్రభావం పడింది. మంచులోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)కి చెందిన కాశ్మీరీ అగ్రనేతలు, జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ భారీ మంచులోనే ప్రసంగించారు. డీఎంకే ఎంపి తిరుచ్చి శివ, బిఎస్పి ఎంపి శ్యామ్ సింగ్ యాదవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పాన్-ఇండియా పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రతిపక్ష నేతలతో కలిసి మెగా ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించింది. దీని కోసం మొత్తం 21 ప్రతిపక్ష పార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించింది. వీటిలో12 పార్టీలు తమ నేతల హాజరును కన్ఫర్మ్ చేశాయి.

అయితే హిమపాతం కారణంగా శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిని మూసివేయవలసి వచ్చింది. అలాగే విమాన రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. తక్కువ దృశ్యమానత, విరామమం లేకుండా కురుస్తున్న మంచు కారణంగా శ్రీనగర్‌కు వెళ్లే అన్ని విమానాలు ఆలస్యమయ్యాయని శ్రీనగర్ విమానాశ్రయ డైరెక్టర్ కుల్దీప్ సింగ్ రిషి ట్విట్టర్‌లో తెలిపారు. విస్తారా ఎయిర్‌లైన్స్ ఇవాళ ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు రెండు విమానాలను రద్దు చేసింది. దీంతో ముగింపు కార్యక్రమానికి వస్తారని భావించిన చాలా మంది విపక్ష నేతలు శ్రీనగర్ కు చేరుకోలేదు. వీరిలో భద్రతా కారణాల దృష్ట్యా కొందరు హాజరుకావడం లేదని స్పష్టం చేయగా తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, టీడీపీ పార్టీలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి. మరో వైపు 12 పార్టీలు రాహుల్ గాంధీ పాదయాత్ర ముగింపు ర్యాలీకు హాజరవుతామని స్పష్టం చేశారు. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ఎవరెవరూ హాజరవుతారనేది సస్పెన్స్ గా మారింది. అంతకు ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో శ్రీనగర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలోనూ ఖర్గే జాతీయ జెండాను ఎగురవేశారు.

ఇవి కూడా చదవండి: భారత్ జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు


Advertisement

Next Story

Most Viewed