యూఏఈలో మరోసారి భారీ వర్షాలు.. పలు విమానాల రద్దు

by S Gopi |
యూఏఈలో మరోసారి భారీ వర్షాలు.. పలు విమానాల రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: అనూహ్య వాతావరణ మార్పుల కారణంగా భారీ తుఫానులు, వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న యూఏఈ ఇటీవలే కొంత తెరపినిచ్చింది. అయితే, రెండు వారాల తర్వాత మరోసారి అక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. భారత్‌కు చెందిన పలు ఎయిర్‌లైన్ సంస్థలు ప్రయాణీకులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. దుబాయ్, షార్జా, అబుదాబీలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విమాన సేవల్లో ఇబ్బందులున్నాయి. ఎయిర్‌పోర్ట్‌కు చేరడానికి ముందే ఫ్లైట్ స్టేటస్ సరిచూసుకోవాలని సూచించాయి. విస్తారా, స్పైస్‌జెట్ సంస్థలు మే 5వ తేదీ వరకు విమానాలు రద్దు లేదా ఆలస్యం అవ్వొచ్చని, అప్‌డేట్ చెక్ చేయాలని ప్రయాణీకులకు తెలియజేశాయి. యూఏఈలోని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌సీఈఎంఏ) పరిస్థితిని ఎదుర్కోవటానికి చర్యలు తీసుకుంటోంది. గత నెలలో కురిసిన భారీ వర్షాల కంటే ఈసారి తక్కువగా ఉంటాయని అంచనాలున్నప్పటికీ, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. బుధవారం రాత్రి నుంచి యూఏఈ మొత్తం వాతావరణ మారిపోయింది. అబుదాబీతో పాటు వివిధ నగరాల్లో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ కారణంగానే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విమానాలు క్యాన్సిల్ చేశారు. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నెల 3వ తేదీ వరకు వర్షాలు కొనసాగవచ్చని ఆ దేశ వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. గత నెల 14-15 తేదీల్లో యూఏఈ మొత్తం భారీ వర్షాలతో మునిగిపోయింది. 1949 తర్వాత గత నెల యూఏఈలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story