Sanjay raut: కుంభమేళాకు మోహన్ భగవత్ ఎందుకు వెళ్లలేదు.. షిండే వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ కౌంటర్

by vinod kumar |
Sanjay raut: కుంభమేళాకు మోహన్ భగవత్ ఎందుకు వెళ్లలేదు.. షిండే వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayag raj) నగరంలో ఇటీవల జరిగిన మహాకుంభమేళాలో శివసేన(UBT) చీఫ్ ఉద్ధవ్ థాక్రే పాల్గొనకపోవడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే (Eknath shinde) విమర్శలు గుప్పించారు. హిందువులని చెప్పుకునే కొంత మంది కుంభమేళాకు మాత్రం వెళ్లలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా శివసేన(యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) స్పందించారు. మహాకుంభమేళాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఎందుకు వెళ్లలేదని షిండేను ప్రశ్నించారు. ఈ విషయంపై షిండే భగవత్‌ను నిలదీయాలన్నారు. ఆదివారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. హిందువు అని చెప్పుకుని నిరంతరం మాట్లాడే భగవత్ కుంభమేళాలో స్నానం చేయలేదని, ఆయనను ఎందుకు లక్ష్యంగా చేసుకోవడం లేదని తెలిపారు.

దేశంలో జరిగే ఏ కుంభమేళాకు కూడా ఆర్ఎస్ఎస్ నేతలు హాజరవ్వడం చూడలేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్, మాజీ సంఘ్ చీఫ్‌లు ఎంఎస్ గోల్వాల్కర్, బాలాసాహెబ్ దేవరస్, రజ్జు భయ్యా, కె సుదర్శన్‌లు కుంభమేళాకు హాజరవడం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. హిందుత్వ సిద్ధాంత కర్త సావర్కర్ సైతం కుంభమేళాను ఎప్పుడూ సందర్శించలేదన్నారు. ప్రధాని మోడీపైనా రౌత్ విమర్శలు గుప్పించారు. ప్రధాని అయ్యే కన్నా ముందు మోడీ ఎప్పుడైనా కుంభమేళాలో పాల్గొన్నారా అని ప్రశ్నించారు. మోడీ కుంభమేళా సందర్శన కేవలం ప్రచారం స్టంట్ మాత్రమేనని ఆరోపించారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సైతం కుంభమేళాకు వెళ్లారని ఆయన మంత్రి వర్గంలోని ఎంతమంది బీజేపీ నేతలు హాజరయ్యారని ప్రశ్నించారు. శివసేనను బీజేపీలో విలీనం చేసి షిండే మళ్లీ సీఎం కావాలనుకుంటున్నారని ఆరోపించారు.



Next Story

Most Viewed