Sambhal Violence: శాంతి, సామరస్యాన్ని పాటించాలి.. సంభాల్ హింస కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

by Shamantha N |
Sambhal Violence: శాంతి, సామరస్యాన్ని పాటించాలి.. సంభాల్ హింస కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ హింస(Sambhal Violence)పై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతి,సామరస్యాన్ని పాటించాలని కోరింది. సంభాల్ లో ఉన్న షాహీ ఈద్గా మ‌సీద్‌లో సర్వే(Sambhal Mosque Survey) చేప‌ట్టేందుకు స్థానిక కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను నిలిపివేయాల‌ని కోరుతూ ఆ మ‌సీదు క‌మిటీ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. అందులోనే ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. ఈ కేసుపై అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించాలని సూచించింది. హైకోర్టులో వాదనలు వినేంత వరకు.. ట్రయల్ కోర్టు ఆదేశాలు అమలు చేయరాదంది. మసీదు సర్వేను నిర్వహించిన కమిషన్ నివేదికను సీల్డ్ కవర్‌లో ఉంచాలని.. ఈలోగా తెరవకూడదని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా(CJI Sanjiv Khanna), జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసును పెండింగ్‌లో పెడుతున్నామ‌ని తెలిపింది. అక్క‌డ మరోసారి హింస జరగాలని కోరుకోవట్లేదంది. పూర్తిగా త‌ట‌స్థంగా ఉండి అక్కడ తప్పు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించింది. ఈ కేసును హైకోర్టు స‌మీక్షించేంత వ‌ర‌కు.. ట్ర‌య‌ల్‌కోర్టు విచార‌ణ కూడా జ‌ర‌గ‌ద‌ని సుప్రీం చెప్పింది.

ట్రయల్ కోర్టు ఏమందంటే?

ఇకపోతే, షాహీ ఈద్గా మ‌సీదు వ‌ద్ద గ‌తంలో హ‌రిహ‌ర హిందూ దేవుళ్ల ఆల‌యం ఉన్న‌ట్లు వేసిన పిటిష‌న్ ఆధారంగా స‌ర్వే చేప‌ట్టేందుకు ట్ర‌య‌ల్ కోర్టు ఆదేశించింది. మ‌సీదులో స‌ర్వే చేయాల‌ని స్థానిక కోర్టు ఆదేశాలు ఇవ్వ‌డంతో వారం క్రితం సంభాల్ లో హింస చెలరేగింది. స్థానికులు, పోలీసుల మ‌ధ్య ఘర్షణ చెలరేగింది. ఆ హింసలో ఐదుగురు చనిపోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ షాహీ ఈద్గా మసీదు కమిటీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది.

Advertisement

Next Story