Jammu Kashmir Assembly: కశ్మీర్ అసెంబ్లీలో మూడో రోజూ కొనసాగిన ఆందోళనలు.. ఎందుకీ నిరసనలు?

by Mahesh Kanagandla |
Jammu Kashmir Assembly: కశ్మీర్ అసెంబ్లీలో మూడో రోజూ కొనసాగిన ఆందోళనలు.. ఎందుకీ నిరసనలు?
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ‌(Jammu Kashmir Assembly)లో ప్రత్యేక హోదా(Special Status) విషయమై మూడో రోజూ ఆందోళనలు కొనసాగాయి. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా, రాజ్యాంగబద్ధ హామీలు దఖలు పరిచే ఆర్టికల్ 370ని(Article 370) పునరుద్ధరించాలని అసెంబ్లీలో పీడీపీ ఎమ్మెల్యే బ్యానర్ పట్టుకున్నారు. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ ఆమోదించిన ప్రత్యేక హోదా తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. పాకిస్తాన్ అజెండా చెల్లదంటూ నినాదాలు చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లడంతో వారిని బయటికి తీసుకెళ్లాలని స్పీకర్ అబ్దుల్ రహీం రాథర్ మార్షల్స్‌ను ఆదేశించారు. 12 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, చట్టసభ్యుడు షేక్ ఖర్షీద్‌లను మార్షల్స్ బయటికి తీసుకెళ్లారు. వెంటనే మిగిలిన 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం, అసెంబ్లీ ప్రాంగణంలో సమాంతర అసెంబ్లీ నిర్వహించారు. సీనియర్ నాయకుడు స్పీకర్ ఇలా ఏకపక్షంగా వ్యవహరిస్తారని తాము భావించలేదని, తమను బయటికి పంపించడం గూండాయిజంలాగే ఉన్నదని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత కశ్మీర్‌లో శాంతి సుస్థిరతలు నెలకొన్నాయని, ప్రజలు సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు.

నేనుండగా అది జరగదు: ప్రధాని

కాంగ్రెస్, దాని ఇండీ మిత్రపక్షాలకు అవకాశం దొరకగానే జమ్ము కశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయని ప్రధాని మోడీ విమర్శించారు. కశ్మీర్ అసెంబ్లీలో ఆర్టికల్ 370ను పునరుద్ధరించాలని తీర్మానం ఆమోదించారని, వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి బయటికి పంపించేశారని తెలిపారు. కానీ, ఇక్కడ మోడీ ఉన్నంతకాలం అది జరగదని, కశ్మీర్‌లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే అమలవుతుందని స్పష్టం చేశారు. అంబేద్కర్‌కు వ్యతిరేకంగా, ఆ రాజ్యాంగంలో దళిత, ఆదివాసీలకు కల్పించిన రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ఈ ఘటనలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. కశ్మీర్‌లో రాజ్యాంగాన్ని అమలు చేయడం బాబా సాహెబ్ అంబేద్కర్‌కు తన నివాళి అని వివరించారు.

జమ్ము కశ్మీర్ ప్రజల అస్తిత్వాన్ని, సంస్కృతి హక్కులను కాపాడే ప్రత్యేక హోదా, రాజ్యాంగబద్ధ హామీలు ముఖ్యమైనవని, వాటిని ఏకపక్షంగా తొలగించడంపై ఈ సభ ఆందోళన వ్యక్తం చేస్తున్నదనే తీర్మానాన్ని డిప్యూటీ సీఎం సురిందర్ చౌదరి మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. జమ్ము కశ్మీర్‌ చట్టసభ్యులతో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చర్చించి ప్రత్యేక హోదా, రాజ్యాంగబద్ధ హామీలను ఖరారు చేసి పునరుద్ధరించాలని ఆ తీర్మానం పేర్కొంది. దేశ సమైక్యతను, జమ్ము కశ్మీర్ ప్రజల చట్టబద్ధ అవకాశాలను, ఆశలను రక్షించేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ఈ తీర్మానానికి పీడీపీ, కాంగ్రెస్, ఎన్సీ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చి ఆమోదానికి దోహదపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ఈ తీర్మానంలో ఎక్కడా ఆర్టికల్ 370 లేదా 35ఏ ప్రస్తావన లేదు.

Advertisement

Next Story