ఆర్టీఐ ‘డెడ్ లెటర్’‌లా మిగిలిపోతుంది : సుప్రీంకోర్టు

by Vinod kumar |   ( Updated:2023-10-30 14:16:29.0  )
supreme court
X

న్యూఢిల్లీ : కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ), రాష్ట్ర సమాచార కమిషన్ల(ఎస్‌ఐసీ)లో ఖాళీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిలో ఖాళీల భర్తీకి సత్వరం చర్యలు తీసుకోవాలని.. లేదంటే సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం ఒక ‘డెడ్ లెటర్’గా మిగిలిపోతుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. జార్ఖండ్, త్రిపుర, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లోని సమాచార కమిషన్లు పనిచేయకుండా పోయాయంటూ ఆర్‌టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. సమాచార కమిషన్లలో ఉన్న ఖాళీలు, వాటిలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య సహా అన్ని అంశాలపై సమాచారాన్ని మూడు వారాల్లోగా సమర్పించాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖను ఆదేశించింది. తమకు అందించే వివరాల ఆధారంగా తదుపరిగా పూర్తిస్థాయి విచారణను చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.

ఆరువారాల్లోగా దివ్యాంగుల సంక్షేమ పథకాల వివరాలివ్వండి..

దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాల వివరాలను వివిధ రాష్ట్రాల నుంచి సేకరించి ఆరు వారాల్లోగా తమకు సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాధారణ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో పోలిస్తే దివ్యాంగులకు 25 శాతం అధికంగా ప్రభుత్వ సహకారం అందేలా చూడాలన్న ‘2016-దివ్యాంగుల హక్కుల చట్టం’లోని నిబంధనల అమలుపై సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ ఈ ఆర్డర్ ఇచ్చింది.

దేశవ్యాప్తంగా డీఎన్ఏ పరీక్షల నిర్వహణకు ఆదేశాలివ్వలేం : సుప్రీం

చిన్నారుల తల్లిదండ్రుల నిర్ధరణకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా డీఎన్​ఏ పరీక్షలను నిర్వహించాలని దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మొత్తం వ్యవస్థను కోర్టులు నడపలేవని ఈ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వ్యక్తిగత కేసులను మాత్రమే తాము పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని ఆదేశించలేమని తేల్చి చెప్పింది.

Advertisement

Next Story