సుప్రీంలో ఉదయనిధికి భారీ ఊరట

by Ajay kumar |
సుప్రీంలో ఉదయనిధికి భారీ ఊరట
X

- సనాతన ధర్మంపై గతంలో వ్యాఖ్యలు

- తమిళనాడు డిప్యూటీ సీఎంపై సుప్రీంలో రిట్ పిటిషన్లు

- విచారణకు స్వీకరించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరణ

దిశ, నేషనల్ బ్యూరో:

తమిళనాడు డిప్యూటీ సీఎం, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ గతంలో 'సనాతన ధర్మం'పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో దాఖలైన మూడు రిట్ పిటిషన్లను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఈ రిట్ పిటిషన్లను విచారణకు స్వీకరించడానికి జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న బి వరాలేతో కూడిన ధర్మాసనం విముఖత చూపించింది. 2023 సెప్టెంబర్‌లో 'సనాతన ధర్మం' గురించి ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతకమైన వ్యాధి. దీన్ని తప్పకుండా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఉదయనిధి పేర్కొన్నారు. అయితే ఉదయనిధి మత సంబంధిత అంశంలో అనేక మంది మనోభావాలను గాయపరిచేలా మాట్లాడారని, ఇవి చాలా మంది మనసులను గాయపరిచాయని, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని బి.జగన్నాథ్, వినీత్ జిందాల్, సనాతన్ సురక్షా పరిషత్ వేర్వేరుగా రిట్ పిటిషన్లు దాఖలు చేశాయి. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్దమైనవని, ఉదయనిధి వ్యాఖ్యలకు మద్దతు పలికిన డీఎంకే ఎంపీ ఏ.రాజాపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోరారు. కానీ సుప్రీంకోర్టు దీనిపై విచారణకు నిరాకరించింది. కాగా, అదే ఏడాది ఉదయనిధికి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని షరతు విధించింది. మరోవైపు తనపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇదే అంశంలో నమోదైన క్రిమినల్ కంప్లైంట్లను ఏకీకృతం చేయాలని సుప్రీంకోర్టును కోరారు. ఆ పిటిషన్ ఇంకా అత్యున్నత న్యాయ స్థానంలో పెండింగ్‌లో ఉంది.



Next Story

Most Viewed