Rajnath Singh: ఉగ్రదాడి దోషులను విడిచిపెట్టబోము.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

by vinod kumar |
Rajnath Singh: ఉగ్రదాడి దోషులను విడిచిపెట్టబోము.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: పహల్గామ్ ఉగ్రదాడికి కారకులైన వారిని విడిచి పెట్టబోమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) హెచ్చరించారు. దుర్మార్గపు చర్యలను సహించే ప్రసక్తే లేదని తెలిపారు. బుధవారం ఆయన అర్జన్ సింగ్ స్మారక ఉపన్యాసంలో మాట్లాడారు. ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ (Zero tollarance) విధానాన్ని అనుసరిస్తోందని, నేరస్థులను చట్టం ముందు నిలబెట్టడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అమానుషమని, ఇది తీవ్ర దు:ఖాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి పిరికి పంద చర్య అని వారు ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భారత్ ఒక పురాతన నాగరికత కలిగిన దేశమని ఈ తరహా ఉగ్రవాద కార్యకలాపాలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఘటనకు త్వరలోనే ప్రతీకారం ఉంటుందని స్పష్టం చేశారు. తమపై దాడి చేసిన వారిని మాత్రమే గాక తెర వెనుక దాగి ఉన్న వారిని సైతం లక్ష్యంగా చేసుకుంటామన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఐక్యంగా ఉన్నామన్నారు. భారత్ పై కుట్రలకు పాల్పడేవారిని గుర్తిస్తామని తెలిపారు. కాగా, జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 27 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించింది.



Next Story