Rajnath singh: భారత్, రష్యాల స్నేహం పర్వతాల కంటే ఉన్నతమైనది.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

by vinod kumar |
Rajnath singh: భారత్, రష్యాల స్నేహం పర్వతాల కంటే ఉన్నతమైనది.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, రష్యాల మధ్య స్నేహం ఎత్తైన పర్వతం కంటే ఉన్నతమైందని, లోతైన సముద్రం కంటే లోతైనదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath singh) అభివర్ణించారు. మాస్కోలో జరుగుతున్న 21వ ఇండియా-రష్యా ఇంటర్‌ గవర్నమెంటల్ కమిషన్ (IRIGC) మిలిటరీ అండ్ మిలిటరీ కోఆపరేషన్ సెషన్‌లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌(Putin)తో రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక రక్షణ సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి అపారమైన సామర్థ్యం ఉందని, ఉమ్మడి ప్రయత్నాల ద్వారా గొప్ప ఫలితాలు సాధించొచ్చని ఇరువురు అభిప్రాయపడ్డారు. భారత్ తన స్నేహితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, భవిష్యత్తులోనూ అలాగే కొనసాగుతుందని రాజ్‌నాథ్ తెలిపారు. G20, బ్రిక్స్, ఎస్సీవో వంటి బహుపాక్షిక వేదికలపై ఇరు దేశాల మధ్య సహకారం పెరుగుతోందని చెప్పారు. అంతకుముందు రాజ్‌నాథ్ రష్యా కౌంటర్ ఆండ్రీ బెలూసోవ్‌ను కలిశారు. ప్రధాని మోడీ పుతిన్‌తో శిఖరాగ్ర చర్చలు జరిపిన ఐదు నెలల తర్వాత రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటనకు వెళ్లడం గమనార్హం.



Next Story