Rajnath Singh: పాక్‌కు ఐఎంఎఫ్ కంటే పెద్ద ప్యాకేజీ.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

by vinod kumar |
Rajnath Singh: పాక్‌కు ఐఎంఎఫ్ కంటే పెద్ద ప్యాకేజీ.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించి ఉంటే పాకిస్థాన్‌కు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) నుంచి వారు కోరిన దానికంటే పెద్ద ప్యాకేజీ ఇచ్చేవాళ్లమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్‌లోని బందిపొర జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘2014-15లో మోడీ జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి స్పెషల్ ప్యాకేజీని ప్రకటించారు. అది ఇప్పుడు 90,000 కోట్లకు చేరుకుంది. ఐఎంఎఫ్ నుంచి పాకిస్థాన్ కోరిన దానికంటే ఇది చాలా ఎక్కువ’ అని తెలిపారు. పాక్ చాలా కాలంగా ఆర్థిక సాయాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఆ దేశంలో టెర్రరిస్టు ఫ్యాక్టరీని నడపడానికే ఇతర దేశాల నుంచి ఆర్థిక సాయం కోరుతోందని ఫైర్ అయ్యారు.

‘ఉగ్రవాదంపై దర్యాప్తు జరిపినప్పుడల్లా పాక్ ప్రమేయాన్ని గుర్తించాం. టెర్రరిస్టు శిబిరాలను నియంత్రించాలని అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాకిస్థాన్ నిరాశకు గురైంది. ఈ క్రమంలోనే తీవ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోంది’ అని తెలిపారు. భారత్ గడ్డపై ప్రజాస్వామ్యం బతికుండటం వారికి ఇష్టం లేదన్నారు. ఉగ్ర బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, అటువంటి వారికి తగిన సమాధానం చెప్పేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. బలమైన సైనిక సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed