ఢిల్లీ ఘటనపై రాహుల్ దిగ్భ్రాంతి.. రద్దీని నియంత్రించడంలో రైల్వేశాఖ విఫలమైందంటూ విమర్శలు

by D.Reddy |
ఢిల్లీ ఘటనపై రాహుల్ దిగ్భ్రాంతి..  రద్దీని నియంత్రించడంలో రైల్వేశాఖ విఫలమైందంటూ విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిలాసట ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. రద్దీని నియంత్రించడంలో రైల్వేశాఖ, కేంద్రం విఫలమైందంటూ విమర్శలు గుప్పించారు. ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే ప్రయాణికుల కోసం మెరుగైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అలాగే ఈ ఘోర దుర్ఘటనపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోం మంత్రి అమిత్ షా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే దిగ్భాత్రి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాగా, యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లేందుకు వచ్చిన భక్తులతో కిక్కిరిసిన న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది చనిపోగా, పదుల సంఖ్య ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల్లో 14 మంది మహిళలు.. నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల పేర్లను రైల్వే అధికారులు వెల్లడించారు. ఆహాదేవి, పింకి దేవి, షీలా దేవి, వ్యోమ్, పూనమ్ దేవి, లలితా దేవి, సురుచి, కృష్ణ దేవి, విజయ్, నీరజ్, శాంతిదేవి, పూజాకుమార్, పూనమ్, సంగీతా మాలిక్, రియా సింగ్, బేబి కుమారి, మనోజ్, మమతాఝా.. లుగా గుర్తించారు. మృతులంతా ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించినట్లు తెలిపారు. చివరి నిమిషంలో రైలు ప్లాట్‌ఫాం మార్చడంతో.. తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు.. ఉన్న ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాం వైపు పరుగులు తీయడంతో తోపులాట జరిగి తొక్కిసలాట జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఇక ఈ ఘటనలో మృతి చెందిన వారికి రైల్వే శాఖ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించనున్నట్లు తెలిపింది. అలాగే, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చోప్పున సహయం చేయనున్నట్లు వెల్లడించింది.



Next Story

Most Viewed