Rahul: రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు.. స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ ఎంపీ దూబే విజ్ఞప్తి

by vinod kumar |
Rahul: రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు.. స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ ఎంపీ దూబే విజ్ఞప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ప్రసంగంపై వివాదం ముదురుతోంది. రాహుల్ సభలో అబద్ధాలు చెప్పి దేశాన్ని కించపరిచారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishi kanth dube) ఆరోపించారు. ఆయనపై వెంటనే సభా హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla)కు మంగళవారం లేఖ రాశారు. ‘రాహుల్ తన స్పీచ్‌లో చారిత్రక వాస్తవాలను వక్రీకరించారు. అంతేగాక దేశం పరువు తీసేందుకు ప్రయత్నించారు. కాబట్టి లోక్ సభ ప్రతిపక్ష నేతపై వెంటనే సభా హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. తన వాదనలను నిరూపించలేకపోతే ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయాల డిమాండ్ చేశారు.

అంతకుముందు సభలో దూబే మాట్లాడుతూ.. తన పదవీ కాలంలో ఇలాంటి అపోజిషన్ లీడర్‌ను తాను ఎన్నడూ చూడలేదన్నారు. ఆయన చాలా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రపంచం ముందు దేశాన్ని బలహీనపర్చడానికి ఉద్దేశ పూర్వకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కాగా, సోమవారం సభలో జరిగిన చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఆయనపై మండిపడుతోంది. రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది.



Next Story

Most Viewed